హైదరాబాద్‌పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్...ప్లేఆఫ్స్‌లో చెన్నై అడుగు

     Written by : smtv Desk | Fri, Oct 01, 2021, 11:55 AM

హైదరాబాద్‌పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్...ప్లేఆఫ్స్‌లో చెన్నై అడుగు

ఐపీఎల్ 2021 సీజన్‌ ప్లేఆఫ్స్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ దర్జాగా గురువారం రాత్రి అడుగుపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. సీజన్‌లో 9వ విజయాన్ని నమోదు చేయడం ద్వారా 18 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ క్రమంలో తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగానూ చెన్నై టీమ్ నిలిచింది. మరోవైపు 9వ మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేయగలిగింది. టీమ్‌లో సాహా (44: 46 బంతుల్లో 1x4, 2x6) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చెన్నై బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, బ్రావో రెండు, జడేజా, శార్ధూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (45: 38 బంతుల్లో 4x4, 2x6), డుప్లెసిస్ (41: 36 బంతుల్లో 3x4, 2x6).. తొలి వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా చెన్నై విజయానికి బాటలు వేయగా.. ఆఖర్లో అంబటి రాయుడు (17 నాటౌట్: 13 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి గెలుపు లాంఛనాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మహేంద్రసింగ్ ధోనీ (14 నాటౌట్: 11 బంతుల్లో 1x4, 1x6) పూర్తి చేశాడు. చెన్నై విజయానికి చివరి మూడు బంతుల్లో 2 పరుగులు అవసరమైన దశలో కళ్లుచెదిరే సిక్స్ బాదిన ధోనీ మ్యాచ్‌ని ముగించాడు. 135 పరుగుల ఛేదనని చెన్నై ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ మెరుగ్గా ఆరంభించినా.. మిడిల్ ఓవర్లలో మొయిన్ అలీ (17), సురేశ్ రైనా (2) తడబడ్డారు. అలానే 16వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్న డుప్లెసిస్ అనూహ్యరీతిలో ఔటైపోయాడు. దాంతో.. చివర్లో మ్యాచ్ కాసేపు ఉత్కంఠగా జరిగింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన ధోనీ రక్షణాత్మక ధోరణిలో బ్యాటింగ్ చేయగా.. అంబటి రాయుడు కూడా తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. దాంతో.. చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ బౌలింగ్‌కి వచ్చిన భువనేశ్వర్ కుమార్‌కి రాయుడు సిక్స్ బాదగా.. ధోనీ ఒక ఫోర్ కొట్టేశాడు. దాంతో.. ఆ ఓవర్‌లో మొత్తంగా 13 పరుగులు వచ్చేయగా.. చివరి ఓవర్‌కి సమీకరణం 6 బంతుల్లో 3 పరుగులుగా మరిపోయింది. సిద్ధార్థ కౌల్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి రెండు బంతులకీ రాయుడు ఒక సింగిల్ రాబట్టగా.. మూడో బంతిని వేస్ట్ చేసిన ధోనీ.. నాలుగో బంతికి సిక్స్ బాదేసి మ్యాచ్‌ని ముగించాడు. మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. సాహాతో కలిసి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన కొత్త ఓపెనర్ జేసన్ రాయ్ (2: 7 బంతుల్లో).. నాలుగో ఓవర్‌లోనే ఔటైపోయాడు. అయినప్పటికీ.. ఒక ఎండ్‌లో దూకుడుగా ఆడిన సాహా.. దీపక్ చాహర్ వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు కూడా కొట్టాడు. కానీ.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11), ఆ తర్వాత ప్రియమ్ గార్గె (7)లను బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో డ్వేన్ బ్రావో ఔట్ చేసేయడంతో.. సాహా దూకుడు తగ్గించి వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. టీమ్ స్కోరు 74 వద్ద నాలుగో వికెట్ రూపంలోసాహా ఔటవడంతో మళ్లీ హైదరాబాద్‌‌లో తడబాటు మొదలైంది. అభిషేక్ శర్మ (18), అబ్దుల్ సమద్ (18) కాస్త దూకుడుగా ఆడినా.. ఇద్దరూ పరుగు వ్యవధిలోనే పెవిలియన్‌కి చేరిపోయారు. అయితే.. చివర్లో రషీద్ ఖాన్ (17 నాటౌట్: 13 బంతుల్లో 2x4) విలువైన పరుగులు చేయడంతో.. హైదరాబాద్ 134 పరుగులైనా చేయగలిగింది.







Untitled Document
Advertisements