ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఔట్

     Written by : smtv Desk | Fri, Oct 01, 2021, 11:59 AM

ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఔట్

ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా గురువారం రాత్రి నిష్క్రమించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో నిరాశపరిచిన హైదరాబాద్ టీమ్ 6 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. సీజన్‌లో 11వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది తొమ్మిదో ఓటమికాగా.. పాయింట్ల పట్టికలోనూ ఆ జట్టు చిట్టచివరి స్థానానికే పరిమితమైంది. సీజన్‌లో ఇంకా ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుండగా.. కనీసం ఆ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో కాస్త పైన ఉండటం ద్వారా టోర్నీని ముగించాలని హైదరాబాద్ ఆశిస్తోంది.

వాస్తవానికి గత ఐదు ఐపీఎల్ సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. 2016లో టైటిల్ విజేతగా నిలిచిన హైదరాబాద్.. ఆ తర్వాత 2017, 2018, 2019, 2020లోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. ఇందులో 2018లో ఫైనల్‌కి చేరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. కానీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి హైదరాబాద్‌ తడబడింది. దాంతో.. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి.. కేన్ విలియమ్సన్‌కి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ.. ఆ జట్టు వైఫల్యాల బాటని వీడలేకపోయింది.

ప్లేఆఫ్స్ నుంచి హైదరాబాద్ నిష్క్రమించడంపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ‘‘టీమ్ పరంగా మేము ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. సీజన్‌లో మ్యాచ్‌లను రెండు దశల్లో నిర్వహించడం కూడా టీమ్ లయని దెబ్బతీసింది. బ్యాటింగ్‌లో మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాం. దాంతో.. ఫైనల్ స్కోరుపై ఆ ప్రభావం పడింది. రాబోవు సీజన్‌లో తప్పిదాలు దిద్దుకుని.. సత్తాచాటుతాం’’ అని చెప్పుకొచ్చాడు.





Untitled Document
Advertisements