పర్యాటక ప్రాంతాల్లో లిక్కర్ అవుట్ లెట్స్ తెరిచేందుకు అనుమతి

     Written by : smtv Desk | Fri, Oct 01, 2021, 08:50 PM

పర్యాటక ప్రాంతాల్లో లిక్కర్ అవుట్ లెట్స్ తెరిచేందుకు అనుమతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. 30 సెప్టెంబరు 2022 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది. కొత్త విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను మరో ఏడాదిపాటు యథాతథంగా కొనసాగిస్తారు. వాకిన్ స్టోర్ల కొనసాగింపుతోపాటు పర్యాటక ప్రాంతాల్లో లిక్కర్ అవుట్ లెట్స్ తెరిచేందుకు కూడా అనుమతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

నూతన మద్యం విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 2,934 దుకాణాల సంఖ్యను పెంచకుండా వాటినే కొనసాగించనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉండేవి. కరోనా తొలి దశ లాక్‌డౌన్ తర్వాత గతేడాది మే నెలలో వాటి సంఖ్యను 2,934కు కుదించింది. ఇప్పుడు వీటినే మరో ఏడాదిపాటు కొనసాగించనుంది. అలాగే, వాకిన్ స్టోర్స్‌ కొనసాగనున్నాయి.

సాధారణ మద్యం దుకాణాల్లో రోజుకు సగటున 2 నుంచి 2.50 లక్షల రూపాయల మద్యం అమ్ముడవుతుండగా, వాకిన్ స్టోర్స్‌లో రూ. 7-8 లక్షల మద్యం అమ్ముడవుతోంది. నిజానికి వీటి ద్వారానే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తోంది. దీంతో పెద్దగా ఆదాయం లేని సాధారణ దుకాణాలను తొలగించి వాటి స్థానంలో రద్దీగా ఉండే, ఖరీదైన ప్రాంతాల్లో వాకిన్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

లాభనష్టాల ఆధారంగా మద్యం దుకాణాలను ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చేందుకు ఏపీఎన్‌బీసీఎల్ ఎండీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఇకపై మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను కూడా స్వీకరించనున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలకు అదనంగా పర్యాటక ప్రాంతాల్లో లిక్కర్ అవుట్ లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చని నూతన మద్యం విధానంలో ప్రభుత్వం పేర్కొంది. కొన్ని పర్యాటక కేంద్రాల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements