@14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి...ఒకే రోజు ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు

     Written by : smtv Desk | Fri, Oct 08, 2021, 11:14 AM

@14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి...ఒకే రోజు ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు

ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు శుక్రవారం ముగియబోతుండగా.. ఈరోజు ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ స్టార్ట్ కాబోతుండగా.. అదే సమయంలో దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొనబోతున్నాయి. 14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే సమయంలో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి.

ఐపీఎల్ 2021 సీజన్‌ ప్లేఆఫ్స్‌కి ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అర్హత సాధించగా.. మిగిలిన ఒక బెర్తు కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ పోటీపడుతున్నాయి. ఈరోజు మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 170+ పరుగుల తేడాతో ముంబయి గెలిస్తేనే..? ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనుంది. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం.. ఆ జట్టు మైదానంలోకి దిగకముందే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ సమయంలో బెంగళూరు, ఢిల్లీ మధ్య కూడా మ్యాచ్ జరగబోతుండటంపై అభిమానులు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తూ.. సెటైర్లు పేలుస్తున్నారు.

వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకి ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకదానిని నిర్వహించి ఉండొచ్చు. కానీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎందుకు ఇలా రాత్రి 7.30 గంటలకి రెండు మ్యాచ్‌లు నిర్వహించబోతోంది? అనేదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్... ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్‌ని.. స్టార్ స్పోర్ట్స్ 1‌, స్టార్‌ స్పోర్ట్స్ 1 తెలుగులో ప్రసారం చేయబోతుండగా.. హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌ని స్టార్‌స్పోర్ట్స్ 2, స్టార్ గోల్డ్, స్టార్ మా గోల్డ్‌లో టెలికాస్ట్ చేయనుంది.





Untitled Document
Advertisements