తెలుగోడి దెబ్బ...ఢిల్లీ అబ్బ

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 11:03 AM

తెలుగోడి దెబ్బ...ఢిల్లీ అబ్బ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో మరో సూపర్ స్టార్ వెలుగులోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లోనే 3x4, 4x6 సాయంతో 78 పరుగులు చేసిన కేఎస్ భరత్.. ఆఖర్లో సిక్స్‌తో బెంగళూరుని గెలిపించాడు. 165 పరుగుల ఛేదనలో బెంగళూరు విజయానికి చివరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. తొలి మూడు బంతుల్లో ఏడు పరుగులు (4, 2, L1) రాబట్టిన పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (51 నాటౌట్:33 బంతుల్లో 8x4) నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో.. నాలుగో బంతికి స్ట్రైక్‌కి వచ్చిన కేఎస్ భరత్.. ఆ బంతిని హిట్ చేయడంలో విఫలమవగా.. ఢిల్లీ బౌలర్ అవేష్ ఖాస్ నవ్వుతూ కనిపించాడు. అయితే.. ఐదో బంతికి భరత్ డబుల్ రాబట్టడంతో.. ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో వైడ్ విసిరిన అవేష్ ఖాన్.. ఆఖరి బంతిని ఫుల్ టాస్ రూపంలో విసిరాడు. దాంతో.. ఆ బంతిని సిక్స్‌గా కొట్టేసిన భరత్.. బెంగళూరుని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.

తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కొట్టిన ఫినిషింగ్ సిక్స్‌కి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గంతులు వేసుకుంటూ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాస్తవానికి చివరి ఓవర్‌లో మాక్స్‌వెల్ పూర్తిగా స్ట్రైక్ తీసుకుంటాడని అంతా ఊహించారు. కానీ.. అప్పటికే మూడు సిక్సర్లు బాదిన భరత్‌పై ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ నమ్మకం ఉంచాడు. అయితే.. నాలుగో బంతి డాట్ అవగానే భరత్ కాస్త ఒత్తిడికి గురైనట్లు కనిపించింది. అలానే చివరి బంతికి ముందు లెగ్ సైడ్ వైడ్ రూపంలో వచ్చిన బంతిని హిట్ చేసేందుకు భరత్ ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ.. ఆఖరి బంతికి చక్కగా సిక్స్ కొట్టిన భరత్.. రాత్రికి రాత్రే బెంగళూరు టీమ్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడు.

వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ హాఫ్‌లో బెంగళూరు.. ఈ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్‌కి కనీసం తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. వికెట్ కీపర్‌గా ఏబీ డివిలియర్స్ వ్యవహరించగా.. రెండో దశలో భరత్‌కి తుది జట్టులో ఛాన్స్ దక్కింది. దాంతో.. కీపర్‌గా మొదట ఆకట్టుకున్న భరత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌‌లోనూ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 130 స్ట్రైక్‌రేట్‌తో 182 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సీజన్‌ ప్లేఆఫ్స్‌లో భాగంగా బెంగళూరు టీమ్‌ ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో షార్జా వేదికగా సోమవారం రాత్రి 7.30 గంటలకి ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది.





Untitled Document
Advertisements