వనస్థలిపురంలో నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 01:29 PM

వనస్థలిపురంలో నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి

శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం మరోసారి వణికిపోయింది. ప్రధానంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జాతీయ రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వెళ్లే మార్గంలో చింతల్‌కుంట వద్ద ఓ వ్యక్తి బైక్‌తో సహా నాలాలో కొట్టుకుపోవడం తీవ్ర కలకలం రేగింది.

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పనామా చౌరస్తా నుంచి ఎల్బీనగర్‌ వరకు వరద నీరు చేరింది. చింతల్‌కుంటలోని సురభి హోటల్‌ సమీపంలో కల్వర్టు నాలా ఉంది. అక్కడ భారీగా వరద చేరింది. అదే సమయంలో సరూర్‌నగర్‌ పరిధిలో తపోవన్‌ కాలనీకి చెందిన జగదీష్‌ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తూ జారిపడ్డాడు. అంతే వరద ప్రవాహానికి బైక్‌తో సహా నాలాలో కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించి బైక్ పట్టుకున్నారు. జగదీష్ మాత్రం నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఏసీపీ పురుషోత్తంరెడ్డి, కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో అందరికీ మణికొండ ఘటన ఒక్కసారిగా కళ్లముందు కనిపించింది. అయితే సుమారు 2 గంటల తర్వాత జగదీశ్ అక్కడ ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అతడు క్షేమంగా రావడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై జగదీశ్ స్పందిస్తూ... ‘ఆటో నగర్‌ నుంచి కర్మాన్‌ఘాట్‌కు వెళ్తుండగా నాలాలో పడిపోయా. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బ్రేక్‌ కొట్టాను. రహదారి ఎడ్జ్‌లో బైకు స్కిడ్‌ కావడంతో బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో కొద్దిదూరం కొట్టుకుపోయాను. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. చేతికి ఏదో తాడు తగలడంతో దాన్ని పట్టుకొని బయటకు వచ్చా. చేతికి, వీపు భాగంలో గాయాలయ్యాయి’ అని చెప్పుకొచ్చాడు.





Untitled Document
Advertisements