బావిలో పడ్డ ఆవు...సహాయం కోసం అర్ధరాత్రి 130 కిలోమీటర్ల ప్రయాణం

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 11:12 AM

బావిలో పడ్డ ఆవు...సహాయం కోసం అర్ధరాత్రి 130 కిలోమీటర్ల ప్రయాణం

ఆవును కాపాడేందుకు అర్ధరాత్రి ఏకంగా 130 కిలోమీటర్లు ప్రయాణించిన మానవతామూర్తుల స్ఫూర్తిదాయక కథ ఇది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం వెంకటితండాకు చెందిన నేనావత్‌ బాలు అనే రైతుకు చెందిన ఆవు ఆదివారం ప్రమాదవశాత్తు 60 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడింది. దాన్ని రక్షించేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

హైదరాబాద్‌లోని యానిమల్స్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఉచితంగా ఇలాంటి జంతు సంబంధిత రక్షణ చర్యలు చేపడతారని తెలియడంతో టోల్‌ఫ్రీ నెం.9697887888కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సొసైటీ సభ్యులు హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ నుంచి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో బయలుదేరి 130 కిలోమీటర్లు ప్రయాణించి వెంకటితండాకు చేరుకున్నారు.

సోమవారం తెల్లవారుజాము నుంచి నాలుగు గంటల పాటు సహాయచర్యలు చేపట్టి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆవుకు ప్రథమ చికిత్స నిర్వహించి ట్రాక్టర్‌లో దేవరకొండకు తరలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సొసైటీ ఫౌండర్‌ ప్రదీప్‌, కార్యదర్శి సంజీవ్‌వర్మ, శశి, చేతన్‌, ప్రభుతేజ, సహదేవ్‌, అనిరుద్‌ తదితరులను స్థానిక రైతులు అభినందించారు.





Untitled Document
Advertisements