బెంగళూరుని ఎలిమినేట్ చేసిన కోల్‌కతా...సునీల్ నరైన్ విధ్వంసం

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 11:31 AM

బెంగళూరుని ఎలిమినేట్ చేసిన కోల్‌కతా...సునీల్ నరైన్ విధ్వంసం

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ దెబ్బకి.. తొలుత బ్యాటింగ్‌లో ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చేతులెత్తేసిన బెంగళూరు 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా క్వాలిఫయర్-2కి చేరిన కోల్‌కతా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం రాత్రి షార్జాలో తలపడబోతోంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో చెలరేగిన సునీల్ నరైన్.. విరాట్ కోహ్లీ (39), కేఎస్ భరత్ (9), గ్లెన్ మాక్స్‌వెల్ (15), ఏబీ డివిలియర్స్ (11) వికెట్లను పడగొట్టేసి బెంగళూరు టీమ్‌‌ని 138 పరుగులకే పరిమితం చేశాడు. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆ తర్వాత ఛేదనలోనూ కోల్‌కతా 11 ఓవర్లు ముగిసే సమయానికి 79/3తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన నరైన్ (26: 15 బంతుల్లో 3x6).. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మూడు బంతుల్నీ సిక్సర్లుగా మలిచేశాడు.

డ్యానియల్ క్రిస్టియాన్ వేసిన షార్ట్, ఫుల్, స్లో డెలివరీలను 6, 6, 6గా కొట్టేసిన నరైన్.. ఒక్కసారిగా స్కోరుని 79/3 నుంచి 101/3కి చేర్చాడు. ఆ తర్వాత కోల్‌కతా గెలుపు సమీకరణం సులభంగా మారిపోయింది. మ్యాచ్‌లో నరైన్ హిట్టింగ్ కీలక మలుపుకాగా.. టీమ్ స్కోరు 125 వద్ద అతను ఔటైపోయాడు. కానీ.. అప్పటికే మ్యాచ్ పూర్తిగా కోల్‌కతా చేతుల్లోకి వచ్చింది. గతంలో నరైన్‌ని ఓపెనర్‌గా ఆడించిన కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి పంపగా.. అతను అంచనాలకి మించి రాణించాడు.





Untitled Document
Advertisements