గోపికా వస్త్రాపహరణం!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 01:20 PM

గోపికా వస్త్రాపహరణం!

ఒకనాడు గోపికలు కొంతమంది యమునా నదికిపోయి  స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. నదీ తీరంలో ఉన్న ఒక మర్రిచెట్టు మొదలులో తమ వస్త్రాలను, ఆభరణాలను పెట్టి నీటిలో దిగి జలక్రీడలాడుతున్నారు. జలక్రీడల్లో కూడా వాళ్లు కృష్ణుణ్ణి స్మరిస్తున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కొంతమంది గోప బాలకులతో కలిసి యమునా నది తీరానికి వచ్చాడు. తోటివారిని కనుసన్నలతో నిలిపి కృష్ణుడు మాట్లాడకుండా, పొదలమాటున పొంచి పొంచి తలవంచుకొని మర్రి చెట్టు మొదట్లో విడిచిపెట్టిన గోపికల చీరలు, రవికలు గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించి చెట్టు పైన కూర్చున్నాడు.
యమునలో స్నానం చేస్తున్న గోపకన్యలలో ఒకరు తాము విడిచిన వస్త్రాలు వృక్ష మొదట్లో లేకుండా పోవడం గమనించి ఒక్కసారి అందరూ గొల్లుమన్నారు. బట్టలు అక్కడ కనిపించకపోయేసరికి వెలవెలపోయారు. అంతవరకు ఉత్సాహంగా జలక్రీడలాడిన గోపస్త్రీలు ఏమి చేయాలో తెలియక నిరుత్సాహంతో ఉన్నారు. ఇంతలో ఎక్కడినుండో మధురంగా మురళీగానం వాళ్లకు వినిపించింది. తన్మయం చెంది నిశ్చేష్టులై నిలిచిపోయారు. మురళీగానం విన్నవారికి సమీపంలో ఎక్కడో కృష్ణుడు దాగి ఉన్నాడు అని నిశ్చయించుకొని. చేతులు జోడించి ఆ నల్లనయ్యను ప్రార్థించారు. నెమ్మదిగా మబ్బుల చాటు నుండి బయటకు వచ్చిన సూర్యునిలా కృష్ణుడు అందరికీ కనువిందు చేస్తూ దర్శనమిచ్చాడు. కంటి ముందు కనబడుతున్న కృష్ణుణ్ని మా చీరలు మాకు ఇవ్వమని ప్రాధేయపడ్డారు. సిగ్గు విడిచి ఒడ్డుకు వచ్చి తన వద్దనున్న వస్త్రాల్ని అందుకొమన్నాడు కృష్ణుడు. కృష్ణుని పలుకులకు ఆ గోపికలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
అప్పుడు కృష్ణుడు" నావంటి భర్త కోసం కాత్యాయనీ దేవిని ఆరాధిస్తున్నారు కానీ, గట్టు పైకి వచ్చి మీ చీరల్ని తీసుకోమంటే సిగ్గుపడి సందేహిస్తున్నారా? శరీరంపై ఇంతటి అలవి కాని అభిమానాన్ని పెంచుకోకండి గోపికల్లారా" అంటూ ఒక తత్వాన్ని ఉపదేశించాడు. ఆయన తత్వోపదేశంతో కన్యామణుల చిత్తాలన్నీ స్వాంతనపడ్డాయి. నెమ్మదిగా తేరుకున్నారు గోపికలందరూ! " కృష్ణ నీ పరీక్షకు నిలవగలిగిన వారలంకాదు. మమ్మల్ని మామూలు కన్యలుగా తలచి విడిచిపెట్టాలి స్వామి! ఇదిగో మేము అందరం ఒక్కసారే రెండు చేతులు పైకి ఎత్తి నీకు వందనం చేస్తున్నాం. ఈ వందనాన్ని స్వీకరించారు మా సిగ్గు అర్థం చేసుకొని కాపాడు" అని  దీనస్వరంతో ప్రార్థించారు. కృష్ణుడు వారిని కరుణించి వారి దుస్తువులని వారికి అందజేశాడు. తర్వాత మరుక్షణంలోనే అక్కడినుండి వారికి కనబడకుండా కనుమరుగైపోయాడు. అటు ఇటు పరిశీలించిన గోపకాంతలు కృష్ణుడు ఆ చోటు విడిచి వెళ్లిపోయాడు అని తలచి గబగబా ఒడ్డుపైకి వచ్చి అంతకంటే వేగంగా తమ తమ చీరలు కట్టుకున్నారు. ఆ తరువాత మధుర స్మృతులతో కిలకిలలాడుతూ ఇళ్లకు వెళ్లిపోయారు





Untitled Document
Advertisements