టీంఇండియా కోసం డబ్బులు తీసుకోకుండానే ఆ పని

     Written by : smtv Desk | Wed, Oct 13, 2021, 06:11 PM

టీంఇండియా కోసం డబ్బులు తీసుకోకుండానే ఆ పని

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు మెంటార్‌గా పనిచేయబోతున్న మహేంద్రసింగ్ ధోనీ.. ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. ఈ మెగా టీ20 టోర్నీ కోసం భారత జట్టుకి మెంటార్‌గా ధోనీని ఎంపిక చేసింది.

టీమిండియాకి మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకి ఎలాంటి ఫీజు వద్దని ముందే చెప్పిన ధోనీ.. ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చాడని గంగూలీ వెల్లడించాడు. భారత్‌కి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్ అందించిన ధోనీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో బీసీసీఐ అతడ్ని మెంటార్‌గా ఎంపిక చేసింది. గత ఏడాది ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఇప్పటికే ఫైనల్‌కి చేరగా.. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటకి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది. భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే ఆక్టోబరు 24 పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగా తలపడనుంది.





Untitled Document
Advertisements