ఐపీఎల్ 2021 ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతా

     Written by : smtv Desk | Thu, Oct 14, 2021, 11:10 AM

ఐపీఎల్ 2021 ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతా

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కి చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో షార్జా వేదికగా బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి.. టైటిల్ పోరుకి అర్హత సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ (36: 39 బంతుల్లో 1x4, 2x6), శ్రేయాస్ అయ్యర్ (30 నాటౌట్: 27 బంతుల్లో 1x4, 1x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, లూకీ ఫెర్గూసన్‌ ఒక్కో వికెట్ తీశారు.

136 పరుగుల ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55: 41 బంతుల్లో 4x4, 3x6), శుభమన్ గిల్ (46: 46 బంతుల్లో 1x4, 1x6) మెరుగైన ఆరంభమిచ్చారు. తొలి వికెట్‌కి 12.2 ఓవర్లలోనే 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. కోల్‌కతా విజయానికి బాటలు వేసింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న అయ్యర్.. టీమ్ స్కోరు 96 పరుగుల వద్ద ఔటవగా.. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (13: 12 బంతుల్లో 1x6) భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకోగా.. ఆ తర్వాత వరుసగా దినేశ్ కార్తీక్ (0: 3 బంతుల్లో), ఇయాన్ మోర్గాన్ (0: 3 బంతుల్లో) షకీబ్ అల్ హసన్ (0: 2 బంతుల్లో) వరుసగా ఔటైపోయారు. దాంతో.. కోల్‌కతా విజయానికి చివరి 2 బంతుల్లో 6 పరుగులు అవసరమవగా.. అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన రాహుల్ త్రిపాఠి (12 నాటౌట్: 11 బంతుల్లో 1x6).. కోల్‌కతా టీమ్‌ని గెలిపించాడు.

కోల్‌కతా విజయానికి చివరి 24 బంతుల్లో 13 పరుగులు అవసరమవగా.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ రెండు పరుగులే ఇచ్చి గిల్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన రబాడ.. ఒక పరుగు మాత్రమే ఇచ్చి దినేశ్ కార్తీన్‌‌‌‌ని ఔట్ చేశాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన నోర్తేజ్ మూడు పరుగులిచ్చి మోర్గాన్‌ని ఔట్ చేసేయడంతో.. మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. కోల్‌కతా విజయానికి చివరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవగా.. ఆఖరి ఓవర్ వేసిన అశ్విన్.. తొలి నాలుగు బంతులకీ ఒక పరుగు మాత్రమే ఇచ్చి షకీబ్, నరైన్‌‌ని బ్యాక్ టు బ్యాక్ ఔట్ చేసేశాడు. కానీ.. ఐదో బంతికి సిక్స్ బాదిన త్రిపాఠి.. కోల్‌కతాని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.





Untitled Document
Advertisements