ఈరోజు శరత్ పూర్ణిమ, కోజాగిరి వ్రతం విశిష్టత

     Written by : smtv Desk | Wed, Oct 20, 2021, 02:40 PM

ఈరోజు శరత్ పూర్ణిమ, కోజాగిరి వ్రతం విశిష్టత

శరత్ పూర్ణిమ ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు.

మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే , దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు.

ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక , మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్ర నామ పారాయణ చేయడం , ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి , ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది.

చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్ర కిరణాలలో ఉన్న ఔషధీ తత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.

ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

కోజాగిరి పౌర్ణమి:

లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ "కోజాగిరి వ్రతం'' "కోజాగిరి వ్రతం'' గురించి తెలుసుకొందాము

సంపదలను , సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవి ని పూజిస్తాము లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం , దారిద్ర్య వినాశక వ్రతం "కోజాగిరి వ్రతం''.

దారిద్ర్యం తొలగిపోయి , లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలిఖిల్య మహర్షిని కోరగా , వాలిఖిల్య కోజాగిరి వ్రతాన్ని వివరించినట్లు పురాణాలలో ఆధారం ఉంది.

పూర్వం మగధదేశంలో "వలితుడు'' అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడట , అతను గొప్ప పండితుడు , భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు , ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాళి , తనకు బంగారం , పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది.

వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి , ఆలోచించి " నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు , అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది.. , కాబట్టి నీ పని జరుగుతుంది'' అని సలహా ఇచ్చాడు...

కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు "రేపు మా తండ్రిగారి ఆబ్ధికం.. , అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు'' అని భార్య చండితో అన్నాడు.

భర్త మాటలు విన్న చండి మామ గారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో "పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి'' రమ్మన్నాడు.
వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు..

కొంతకాలం తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది , సాయంకాలం అయింది , నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు.

పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కలా గాలించారు. వారికి వలితుడు కనిపించాడు.

వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వారికీ వివరించాడు. ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు.

లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని వున్నారో చూడడానికి రాగా , వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు.

దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలిఖిల్య మహర్షి వివరించాడట..

కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి , ఆ రాత్రి జాగరణ చేస్తూ , పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలూ చెబుతున్నాయి.





Untitled Document
Advertisements