వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 12:18 PM

వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు

కోలీవుడ్ హీరో శింబు తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో అందరి ముందే కన్నీరు పెట్టుకున్నారు. వేదికపై మాట్లాడుతూ ప్రసంగం మధ్యలో తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకోవడంతో పక్కనే ఉన్న ప్రముఖులు అతడిని ఓదార్చారు. ఇటీవల కొందరు తనకు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారంటూ తన గోడు వెలిబుచ్చారు శింబు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘మానాడు’. ఈ నెల 25వ తేదీన ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ఆడియో వేడుక నిర్వహించారు. అయితే ఈ వేదికపై ఆరంభంలో సరదాగా మాట్లాడుతూ సినిమా విశేషాలు చెప్పిన హీరో శింబు.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తనను కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అయితే, ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం మీరే (అభిమానులు) చూసుకోవాలని శింబు చెప్పడం గమనార్హం.

ఇకపోతే వెంకట్‌ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, కాకపోతే కొన్ని కారణాలతో ఆలస్యమైందని శింబు చెప్పారు. తనకు ‘మానాడు’ లైన్‌ నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని, ఈ సినిమా కోసం తనతో పాటు చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడిందని ఆయన చెప్పారు. ఎస్‌ జే సూర్య అద్భుతంగా నటించారని, ఈ సినిమా విడుదలయ్యాక ఆయన స్థాయి మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా శింబు పేర్కొన్నారు. ‘మానాడు’ మూవీలో వినోదానికి కొదవే ఉండదని ఆయన తెలిపారు.

Untitled Document
Advertisements