పౌరాణికాలలో తండ్రికి తగిన తనయుడు.. బాలయ్య రీమేక్ చేసిన తండ్రి చిత్రాలు ఇవే!

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 08:57 AM

పౌరాణికాలలో తండ్రికి తగిన తనయుడు.. బాలయ్య రీమేక్ చేసిన తండ్రి చిత్రాలు ఇవే!

తెలుగు తెర ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు తెరపై, తెలుగు ప్రేక్షకుల హృదయాలపైన ఎన్టీఆర్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. సాంఘిక .. జానపద .. పౌరాణిక .. చారిత్రక చిత్రాల ద్వారా ఎన్టీఆర్ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. వెండితెరపై రాముడైనా-కృష్ణుడైనా-రాయలవారైనా-విశ్వమిత్రుడైనా-శ్రీనాథ కవిసార్వభౌముడైనా ఎన్టీ రామారావే. అంతటి తేజస్సు ఉన్న కథానాయకుడు ఏ భాషలోను కనిపించడు. ఎన్టీ రామారావు తరువాత జానపద .. పౌరాణిక పాత్రలు చేయాలంటే ఆయన వారసుడైన బాలకృష్ణ వల్లనే అవుతుందనే టాక్ వచ్చింది.
బాలకృష్ణ తన తండ్రి మాదిరిగా అన్నిరకాల పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపుతూ వచ్చారు. ముఖ్యంగా జానపద .. పౌరాణిక పాత్రలలో తన తండ్రిని గుర్తుకు చేశారు. తన తండ్రి చేసిన కొన్ని చిత్రాలను రీమేకులలో తాను చేశారు. అలాంటి చిత్రాలలో జాబితాలో 'నర్తనశాల' ఒకటిగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ చేసిన పౌరాణికాలలో 'నర్తనశాల' ఒకటి.
'విరాటపర్వం' చుట్టూ తిరిగే కథ ఇది. కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అలాంటి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని బాలకృష్ణ భావించారు. ద్రౌపదిగా నటిస్తున్న సౌందర్య చనిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
ఇక ఎన్టీ రామారావు 'రాముడు భీముడు' టైటిల్ తో ద్విపాత్రాభినయం చేయగా అదే టైటిల్ తో బాలకృష్ణ కూడా ద్విపాత్రాభినయం చేశారు. రామారావు చేసిన 'వద్దంటే డబ్బు'చిత్రానికి బాలకృష్ణ చేసిన 'బాబాయ్ అబ్బాయ్' చిత్రానికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాలకృష్ణకి మంచి హిట్ ను ఇచ్చింది. రామారావు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'పాండురంగ మహాత్మ్యం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని రీమేకులో బాలకృష్ణ చేయగా ఫలితం నిరాశపరిచింది.
'లవకుశ' చిత్రాన్ని 'శ్రీరామరాజ్యం' పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్ చేయబడింది. బాపు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఫరవాలేదనిపించుకుంది. రామారావు కెరియర్లో జానపదాలలో తలమానికంగా కనిపించే పాతాళభైరవి .. గులేబకావలి కథ .. జగదేకవీరుడు .. రాజపుత్ర రహస్యం చిత్రాల్లోని కథలను టచ్ చేస్తూ 'భైరవద్వీపం' రూపొందింది. ఈ చిత్రం బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఇలా బాలకృష్ణ జానపద .. పౌరాణికాలలో తండ్రికి తగిన తనయుడుగా బేష్ అనిపించుకోవడం విశేషం.








Untitled Document
Advertisements