క్రెడిట్ కార్డు లోన్, ఆటో లోన్ రేట్లు పెంపు!

     Written by : smtv Desk | Thu, May 05, 2022, 11:45 AM

క్రెడిట్ కార్డు లోన్, ఆటో లోన్ రేట్లు పెంపు!

అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు కఠినతరమైన తన మానిటరీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. తన బెంచ్ మార్కు లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది. 20 ఏళ్లలో ఇదే అత్యంత గరిష్ట స్థాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తన టార్గెట్ ఫెడరల్ ఫండ్స్ రేటును 0.75 శాతం నుంచి 1 శాతం మధ్యలో ఉంచేందుకు మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు ఫెడ్ ప్రకటించింది. మరో అత్యధిక రేటు పెంపు మున్ముందు చూడొచ్చని కూడా ఫెడ్ వ్యాఖ్యానించింది. దీంతో వడ్డీ రాబోయే రోజులలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ పాలసీలో మరో 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
2000 తర్వాత ఇంత కఠినతరమైన స్థాయిలో ధరల పెంపు చేపట్టడం ఇదే తొలిసారి. 9 ట్రిలియన్ డాలర్ల తన బ్యాలెన్స్ షీటును తగ్గించుకోవడం ప్రారంభిస్తానని కూడా ఫెడ్ ప్రకటించింది. ఈ బ్యాలెన్స్ షీటులో ఎక్కువగా ట్రెజరీ, మోర్టగేజ్ బాండ్లు ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ హోల్డింగ్స్‌ను రెండింతలు పెంచింది. ఫెడ్ తన హోల్డింగ్స్‌ను తగ్గించుకోబోతుండటంతో.. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఫెడ్ తన క్రెడిట్ పాలసీని కఠినతరం చేయడంతో.. చాలా మంది కన్జూమర్లకు, వ్యాపారస్తులకు రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డు లోన్ల, ఆటో లోన్ల రేట్లు పెరుగుతాయని అన్నారు. ఆహారం, విద్యుత్, కన్జూమర్ గూడ్స్ ధరలు భారీగా పెరగడంతో.. వీటి రేట్లను అదుపులోకి తీసుకురావాలని ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. బారోయింగ్ కాస్ట్‌లను పెంచడం ద్వారా ప్రజల ఖర్చులను అదుపులోకి తీసుకురావాలని ఫెడ్ నిర్ణయించింది. ఫెడ్ క్రెడిట్ పాలసీ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొంత ప్రభావం చూపుతోంది. ఫెడ్ రేట్ల పెంపును చేపట్టనుందనే నేపథ్యంలోనే మోర్టగేజ్ రేట్లు పెరిగాయి. దీంతో ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో ఇళ్ల అమ్మకాలు అక్కడ 2.7 శాతం తగ్గాయి. 30 ఏళ్ల మోర్టగేజ్ కనీస రేటు ఈ ఏడాది ప్రారంభం నుంచి 2 శాతం పెరిగింది.





Untitled Document
Advertisements