మళ్లీ ఆపరేషన్స్‌ను ప్రారంభిస్తున్న జెట్ ఎయిర్‌వేస్..

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 10:57 AM

మళ్లీ ఆపరేషన్స్‌ను ప్రారంభిస్తున్న జెట్ ఎయిర్‌వేస్..

ఒకప్పుడు ఎంతో పేరుగాంచిన ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్. కానీ ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మూడేళ్ల క్రితం రాత్రికి రాత్రే ఆ సంస్థ ఆపరేషన్స్‌ను మూసివేసి అటు ఉద్యోగులకు, ఇటు విమాన ప్రయాణికులకు షాకిచ్చింది. మూడేళ్ల పాటు గ్రౌండ్‌కే పరిమితమైన ఈ ఎయిర్‌లైన్ సంస్థ.. ఇప్పుడు మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు చూస్తోంది. ఈ మేరకు జెట్ ఎయిర్‌వేస్ తన టెస్ట్ ఫ్లయిట్‌ను హైదరాబాద్ విమానశ్రయం నుంచి గాల్లోకి ఎగరవేసింది. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ పొందేందుకు ఈ టెస్ట్ ఫ్లయిట్‌ను నిర్వహించింది.
జెట్ ఎయిర్‌వేస్ ఏప్రిల్ 17, 2019 నుంచి ఎగరలేదు. జలాన్-కల్‌రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్ ఆపరేషన్స్‌ను మళ్లీ లాంచ్ చేయాలని చూస్తున్నాయి. కాగా, గురువారం జెట్ ఎయిర్‌వేస్‌ది 29వ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ బర్త్‌డే సందర్భంగానే టెస్ట్ ఫ్లయిట్‌ను ఎగరవేసింది. మళ్లీ జెట్ ఎయిర్‌వేస్ ఎగురుతుందని ఆనందంతో ట్వీట్ కూడా చేసింది. ‘ఈ తరుణం కోసం వేచిచూస్తోన్న మా అందరికీ ఇది ఎంతో భావోద్వేగమైన రోజు. జెట్ నమ్మకపు కస్టమర్లు ఇక వేచి చూడాల్సినవసరం లేదు. జెట్ మళ్లీ ఆపరేషన్స్‌ను ప్రారంభిస్తుంది’ అంటూ జెట్ ఎయిర్‌వేస్ భావోద్వేగమైన ట్వీట్‌ను చేసింది.
జెట్‌ని మళ్లీ గగనతలంలో ఎగిరేలా శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఇది ఎంతో భావోద్వేగమైన క్షణమని టెస్ట్ ఫ్లయిట్ ఆపరేషన్స్‌పై ఈ ఎయిర్‌లైన్ సంస్థ సీఈవో సంజీవ్ కపూర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎగిరిన ఆ టెస్ట్ విమానం ఢిల్లీకి చేరుకుంది. ప్రూవింగ్ ఫ్లయిట్(అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు అనువైన విమానం) మరికొన్ని రోజుల్లో ఢిల్లీ నుంచి ఎగురుతుందని సంజీవ్ కపూర్ పేర్కొన్నారు.
ఎయిర్‌క్రాఫ్ట్‌, దాని కాంపోనెంట్లు సాధారణ ఆపరేషన్స్‌కు సరిపోతాయని ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏకు నిరూపించేందుకు ఈ టెస్ట్ ఫ్లయిట్‌ను నిర్వహించారు. టెస్ట్ ఫ్లయిట్ తర్వాత.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి పొందే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌తో ప్రూవింగ్ ఫ్లయిట్‌లను జెట్ ఎయిర్ వేస్ నడపనుంది. ఈ ప్రూవింగ్ ఫ్లయిట్స్ అచ్చం కమర్షియల్ ఫ్లయిట్ మాదిరిగానే డీజీసీఏ అధికారులు, ఎయిర్ లైన్ అధికారులు, క్యాబిన్ సిబ్బందితో నడవనుంది. గురువారం బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌తో టెస్ట్ ఫ్లయిట్‌ను నడిపింది జెట్ ఎయిర్‌వేస్.





Untitled Document
Advertisements