తెరుచుకున్న కేధార్ నాథ్ ఆలయం!

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 11:45 AM

తెరుచుకున్న కేధార్ నాథ్ ఆలయం!

చార్ ధామ్ యాత్రలో కేధార్ నాథ్ కూడా ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయం భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. వేద మంత్రాల నడుమ అర్చకులు, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి సమక్షంలో ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
హిమాలయాల పర్వత శ్రేణుల మధ్య కొలువైన ఈ ఆలయం సంవత్సరంలో ఆరు నెలల పాటే భక్తుల దర్శనాలకు అందుబాటులో ఉంటుంది. వైశాఖ మాసంలో తెరిచే ఆలయాన్ని.. కార్తీక పౌర్ణమి అనంతరం మూసివేస్తారు. ఆ తర్వాత నుంచి తీవ్ర మంచుతో కూడిన పరిస్థితుల వల్ల ఆలయాన్ని తెరిచే అనుకూల పరిస్థితులు ఉండవు.
జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేథారనాథుడు 11వది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని తెరవడానికి కొన్ని గంటల ముందు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టు సీఎం దామి ట్వీట్ చేశారు. భద్రమైన, సురక్షితమైన ప్రయాణానికి ప్రభుత్వం భరోసా ఇస్తున్నట్టు ప్రకటించారు.
చార్ ధామ్ యాత్రలో కేధార్ నాథ్ కూడా ఒకటి. ఈ నెల 3నే కేధార్ నాథ్ సమీపంలోని గంగోత్రి, యుమునోత్రి నదుల సందర్శనను ప్రారంభించారు. చార్ ధామ్ యాత్రకు ఇది ప్రారంభ సూచిక. కేధార్ నాథ్ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి 22 కిలోమీటర్ల మేర పర్వత మార్గంలో ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. భౌగోళికంగా అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ప్రదేశం ఇది.
చార్ ధామ్ యాత్రలో రోజువారీగా భక్తులకు రాష్ట్ర సర్కార్ పరిమితి విధించింది. కేధార్ నాథ్ ఆలయాన్ని నిత్యం 12వేల మంది, బద్రినాథ్ ఆలయాన్ని 15 వేల మంది సందర్శించుకోవచ్చు. భక్తులు కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ చూపించాల్సిన అవసరం లేదు.





Untitled Document
Advertisements