అక్కడి పాఠశాలల్లో క్లాస్‌ రూమ్‌లుగా మారనున్న బస్సులు!

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 04:26 PM

అక్కడి పాఠశాలల్లో క్లాస్‌ రూమ్‌లుగా మారనున్న బస్సులు!

ఏ ప్రభుత్వమైనా పాడైపోయిన బస్సులను వినియోగించడానికి ఒప్పుకోదు. కాబట్టి పాడైపోయిన బస్సులను పక్కన పడేస్తారు. ఎందుకంటే సరిగ్గా పనిచేయని బస్సులను ఉపయోగిస్తే.. ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటిని స్క్రాప్‌కు వేసేస్తుంటారు. ఇలా చాలా రాష్ట్రాల్లో నిరుపయోగంగా ఉండిపోయిన బస్సులు కొన్ని వందల్లో ఉంటాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇలా నిరుపయోగంగా ఉండిపోయిన బస్సుల సమస్యను కేరళ ప్రభుత్వం వినూత్నంగా పరిష్కరించనుంది.
కాలంచెల్లిన బస్సుల విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడైపోయిన బస్సులను క్లాస్‌ రూమ్‌లుగా మార్చనుంది. కేఎస్ఆర్టీసీ బస్సులను తరగతి గదులుగా ఉపయోగించనున్నట్టు ఆ రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి ఆంటోని రాజు తెలిపారు. కాలం చెల్లిన బస్సులను తిరిగి రోడ్డుపైకి తెచ్చే పరిస్థితి లేదని, వాటిని స్క్రాప్‌లుగా విక్రయించడం కంటే ఈ విధంగా ఉపయోగించాలనే ఆలోచన వచ్చినట్టు మంత్రి చెప్పారు.
"అందులోనూ లోఫ్లోర్ బస్సులను తరగతి గదులుగా మార్చాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు కొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నాం." అని రాజు అన్నారు. ఇందులో భాగంగా మొదట రెండు లో ఫ్లోర్ బస్సులను తిరువనంతపురంలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేస్తామని రాజు చెప్పారు. అనంత‌రం అన్ని పాఠ‌శాల‌ల‌కు విస్త‌రిస్తామ‌ని ఆయన చెప్పారు. ప్రస్తుతం నిరుపయోగంగా వందలాది బస్సులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 400 బ‌స్సులను త‌ర‌గ‌తి గ‌దులుగా మార్చనున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో తరగతి గదుల కొరత తీరనుంది.
కాగా కరోనా కారణంగా కేరళ టూరిజం బాగా దెబ్బతింది. కోవిడ్, లాక్‌డౌన్‌తో పూర్తిగా ఆ రంగం కుదేలైంది. దాంతో ఎంతోమంది ప్రైవేట్ ట్రావెల్స్ కోలుకోలేని విధంగా అప్పులపాలయ్యారు. పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయి.. బిజెనెస్ ముందుకు సాగేది కాదు. దాంతో అవసరాలు తీరడం కూడా కష్టమై.. చాలామంది ఆ బిజినెస్‌ను వదిలేశారు. వారి బస్సులను కేజీల చొప్పున స్క్రాప్‌కు విక్రయించేశారు.





Untitled Document
Advertisements