సమ్మర్ స్పెషల్ రిలీజైన 'ఎఫ్ 3' పబ్లిక్ టాక్..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 12:33 PM

సమ్మర్ స్పెషల్ రిలీజైన 'ఎఫ్ 3' పబ్లిక్ టాక్..

సమ్మర్ స్పెషల్ ఎంటర్టైనర్ గా విడుదలైన ''ఎఫ్ 3'' చిత్రం. విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. 2019 సంక్రాంతి సీజన్ లో ఘనవిజయం సాధించిన 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో ఈ సినిమా తెరకెక్కింది.
పక్క కామెడీ ఎంటర్టైనర్ గా రూపొంది సమ్మర్ స్పెషల్ గా రిలీజై మూడింతల వినోదం అందించబోతున్నారని ప్రచారం చేయబడిన 'ఎఫ్ 3' చిత్రం ఈరోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా రివ్యూలు రేటింగులు ఇచ్చేస్తున్నారు.
'ఎఫ్ 2' లో మెయిన్ క్యారెక్టరైజేషన్లతో కొత్త కథతో ''ఎఫ్ 3'' చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. అందులో భార్యాభర్తల కథకు ఫన్ అండ్ ఫస్ర్టేషన్ కలిపి చూపిస్తే.. ఇక్కడ కథంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. వెంకటేష్ రేచీకటి బాధితుడిగా ఎప్పటిలాగానే తన మార్క్ టైమింగ్ తో అదరగొట్టేశాడు. ఇక వరుణ్ తేజ్ నత్తితో మాట్లాడే యువకుడిగా నవ్వులు పూయించారు.
చెప్పుకోడానికి కథ ఏమీ పెద్దగా లేకపోయినా.. ఆధ్యంతం ఎంటర్టైన్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను నడిపించారు. తమన్నా భాటియా మరియు మెహ్రీన్ ఇద్దరూ తగినంత గ్లామర్ డోస్ అందించగా.. సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ లో మెరిసింది. సునీల్ - అలీ కామెడీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు.
వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ - ప్రగతి - అన్నపూర్ణ - వై విజయ వంటి భారీ తారాగణాన్ని అనిల్ హ్యాండిల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించినా.. పెద్దగా అలరించలేకపోయిందని అంటున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక మైనస్ అని పబ్లిక్ టాక్ ని బట్టి తెలుస్తోంది. సినిమాను తన మార్కు కామెడీతో నడిపించిన అనిల్ రావిపూడి.. కొన్నిచోట్ల కామెడీ సీన్లను బలవంతంగా పెట్టినట్లు ఉందని అంటున్నారు. 'ఎఫ్ 2' కంటే ఇది ఎక్కువ నవ్వించిందని కొందరు అంటుంటే.. 'f2' కి మూడింతలు ఫన్ మాత్రం కాదని మరికొందరు అంటున్నారు.
మొత్తం మీద కథ గురించి ఆలోచించకుండా చూస్తే నవ్వుకుంటూ థియేటర్లలో నుంచి బయటకు వస్తారనే పబ్లిక్ టాక్ ని బట్టి అంచనాకి రావచ్చు.









Untitled Document
Advertisements