అదానీకి మోదీ సిఫార్సు.. శ్రీలంకలో పెను దుమారం.. ఆ వ్యాఖ్యలపై అధికారి యూటర్న్

     Written by : smtv Desk | Mon, Jun 13, 2022, 04:42 PM

 అదానీకి మోదీ సిఫార్సు.. శ్రీలంకలో పెను దుమారం.. ఆ వ్యాఖ్యలపై అధికారి యూటర్న్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంకలో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ పవర్ ప్లాంట్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. భారత్‌లో విలువైన మౌలిక వసతుల ప్రాజెక్ట్లన్నీ అదానీ చేతిలోనే ఉన్నాయి. ప్రముఖ పోర్ట్‌లు కూడా అదానీ దక్కించుకున్నారు. అయితే మోదీ రికమండేషన్‌తో శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ దక్కిందని, అధ్యక్షుడు గొటాబయ రాజపక్సేపై భారత ప్రధాని ఒత్తిడి తీసుకొచ్చినట్టు సిలోన్ ఎలక్ట్రిసిటీ సీనియర్ అధికారి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు ఇటీవల భారత్ ఉదారంగా సాయం చేసింది. ఆహారం, అత్యవసర ఔషదాలు, వైద్య పరికరాలను కూడా ఉచితంగా అందజేసింది. అయితే, శ్రీలంకలోని ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను గౌతమ్ అదానీ గ్రూప్‌కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు గోటాబయ రాజపక్సేపై ఒత్తిడి చేశారని ఓ సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. అయితే, ఈ వ్యాఖ్యలను అధ్యక్షుడు రాజపక్సే తీవ్రంగా ఖండించారు. తన తప్పేమీ లేదని, మోదీ తనపై ఒత్తిడి తేలేదని ఆయన స్పష్టం చేశారు.కానీ, సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్‌ ఎంఎంసీ ఫెర్డినాండో చేసిన వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. తాజాగా, ఫెర్డినాండ్ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తప్పుదారి పట్టించే ప్రశ్నల కారణంగా తాను భావోద్వేగంతో అలా చెప్పాల్సి వచ్చిందని, దీనికి క్షమాపణలు చెబుతున్నారని ఆయన వివరణ ఇచ్చారు.మన్నార్ జిల్లాలోని 500 మెగావాట్ల అదానీ విండ్ పవర్ ప్లాంట్‌పై ఆరోపణలు రావడంతో.. పార్లమెంటరీ కమిటీ విచారణ మొదలు పెట్టింది. ఈ విచారణకు శుక్రవారం హాజరైన ఫెర్డినాండో వాంగ్మూలం ఇచ్చారు. అధ్యక్షుడు గొటాబయ రాజపక్సపై భారత ప్రధాని ఒత్తిడి తెచ్చినమాట వాస్తవం అని, ఆ విషయాన్ని తనతో ఆయనే స్వయంగా చెప్పి ప్రాజెక్ట్ అదానికి వచ్చేలా చూడమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో శ్రీలంకలో రాజకీయ దుమారం చెలరేగింది. కానీ, గొటాబయ ఈ ఆరోపణలను ఖండించారు. తన తప్పేమీ లేదని, మోదీ తనపై ఒత్తిడి తేలేదని ప్రకటించారు. విండ్‌, సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టుల విషయంలో ఎటువంటి పోటీ లేకుండా 1989 నాటి ఎలక్ట్రిసిటీ చట్టానికి శ్రీలంక పార్లమెంట్‌ సవరణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్‌‌ మన్నార్‌ ప్లాంట్‌ను దక్కించుకోగా.. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 10 మెగావాట్ల సామర్థ్యం దాటితే బిడ్డింగ్ నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ డిమాండ్ చేసింది. కానీ, మెజార్టీ ఎంపీలు సవరణకు అనుకూలంగా ఓటేశాయి.
మన్నార్‌లో 500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్లాంటు విషయంలో పీపీఏ పద్ధతిలో 25 సంవత్సరాలకు సీఈబీతో అదానీ గ్రూప్‌ 2021లో ఒప్పందం చేసుకుంది. యూనిట్‌ విద్యుత్ 6.50 అమెరికన్‌ సెంట్లకు విక్రయించేలా అంగీకరించింది. ప్రస్తుతం ఆ ధరను ఏకంగా 7.55 సెంట్లకు చేర్చింది. దీంతో శ్రీలంకలోని విద్యుత్ ఇంజినీర్లు అదానీ గ్రూప్‌పై మండిపడుతున్నారు. పోటీ లేకుండా చేసి, అదానీకి ఈ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టడం వల్ల శ్రీలంక ప్రభుత్వానికి భారీ నష్టం వాటిళ్లిందని అంటున్నారు.





Untitled Document
Advertisements