పాముకాటుకు కన్నుమూసిన చిట్టితల్లి..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 02:37 PM

పాముకాటుకు కన్నుమూసిన చిట్టితల్లి..

తనకేం జరిగిందో తెలీదు. ఊపిరాడని స్థితిలో తీవ్ర బాధను అనుభవించింది. చెప్పేందుకు నోరురాక, శరీరం సహకరించక చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించిందో చిట్టితల్లి. పదకొండేళ్ల ఆ అమ్మాయి పేరు అంజలి. వెల్దుర్తి మండలం. పుల్లగుమ్మి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవిలకు నలుగురు కుమార్తెలు. మూడవ కుమార్తె అంజలి. కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీదేవి తన ఆఖరు కూతురుతో కలిసి రెండేళ్ల నుంచి పుట్టిల్లు బలపాలపల్లెలో ఉంటోంది. తండ్రి బ్రహ్మయ్య ఆ సమయం నుంచే అతడు పక్షవాతంతో మంచం పట్టాడు. దీంతో ఇంట్లో ఉన్న ముగ్గురు కుమార్తెలు కుటుంబ భారం మోస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. మూడవ కుమార్తె అంజలి స్థానిక ఎంపీపీ స్కూల్‌లో 5వ తరగతి పూర్తి చేసుకుంది. సెలవులు రావడంతో తన అక్కలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఆదివారం ప్రతి రోజూ మాదిరిగానే ఇంట్లోనే పడుకుంది అంజలి. 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో కాలికి ఏదో కరిచినట్లుగా గుర్తించి. అబ్బా అనుకుంటూనే వెళ్లి పడుకుంది. రెండు గంటల తరువాత గొంతు మరియు మొహం వాచిపోయి, శరీరంలోను, కాలి వద్ద నొప్పి మొదలైంది. చెప్పుకోవడానికి తల్లి కూడా లేకపాయె అంటూ భాదతో లోపలోనే కుమిలిపోయింది. తండ్రి పక్షవాతంతో ఉన్నాడు. అక్కలు గాఢ నిద్రలో ఉన్నారు. ఎలా అంటూ తడబడుతూ బయటకు వచ్చి పక్క ఇంట్లో ఉంటున్న జేజినాయన చిన్నమారెన్న వద్దకు వెళ్లింది. అక్కడ జేజినాయన, జేజి, చిన్నాన్నకు విషయం తెలుపలేక అప్పటికే మూగబోతున్న గొంతుతో కొద్దికొద్దిగా చెబుతూ,ఆకరికి సైగలు చేసింది. నోరు మెదపలేని స్థితిలో ఊపిరి ఎగదోసుకుంటూ వచ్చిన బాలికను చూసి వారు భయపడిపోయారు. ఏం జరిగిందో తెలీదు, అసలు అమ్మాయి ఏం చెప్పలేకపోతోంది అంటూ చివరకు అచేతనావస్థకు చేరుకుంటోంది. పాముకాటు వేసినట్లు తెలుసుకొని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పాముకాటుకు తగిన చికిత్స అందించకపోగా సోమవారం తెల్లవారుజామున అంజలి కన్నుమూసింది.





Untitled Document
Advertisements