జూలై నెలలో మీరు యూపీఐ పేమెంట్లు చేసారా... అయితే నమోదైన ఈ రికార్డులో మీరు ఉన్నారు...

     Written by : smtv Desk | Tue, Aug 02, 2022, 01:12 PM

జూలై నెలలో మీరు యూపీఐ పేమెంట్లు చేసారా... అయితే నమోదైన ఈ రికార్డులో మీరు ఉన్నారు...

దేశంలో డిజిటల్ చెల్లింపులు అంతకంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. గడిచిన నెల జులైలో యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) రూపంలో లావాదేవీలు ఏకంగా 600 కోట్లకుపైగా నమోదయ్యాయి.
మొత్తం 6.28 బిలియన్ పేమెంట్లు జరపగా.. వీటి విలువ రూ.10.62 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో 2016లో డిజిటల్ చెల్లింపులు మొదలైన నాటి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం డేటా విడుదల చేసింది. నెలవారీగా చూస్తే లావాదేవీల పరిమాణం 7.16 శాతం వృద్ధి చెందగా.. వాటి విలువ 4.76 శాతం మేర పెరిగింది. ఇక గతేడాది జులైతో పోల్చితే లావాదేవీలు దాదాపు రెట్టింపయ్యాయి. పేమెంట్ల విలువ 75 శాతం మేర వృద్ధి చెందినట్టు స్పష్టమవుతోంది.
యూపీఐ లావాదేవీల సంఖ్య 100 కోట్ల మార్క్‌ను తొలిసారి అక్టోబర్ 2019లో చేరింది. మూడేళ్ల తర్వాత ఈ మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత ఏడాదిలోనే 100 కోట్ల లావాదేవీలు పెరిగాయి. అక్టోబర్ 2020లో 2 బిలియన్లకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తర్వాత 10 నెలల్లోనే 100 కోట్ల లావాదేవీలు పెరిగాయి. ఆ తర్వాత రికార్డ్ స్థాయిలో 3 నెలలకే మరో 10 కోట్ల లావాదేవీలు జతకలిశాయి. చక్కటి వృద్ధి సాధిస్తున్న క్రమంలో వచ్చిన కరోనా మహమ్మారి ప్రభావం యూపీఐ పేమెంట్ల సంఖ్య పెరుగుదల ఆజ్యం పోసింది. దీంతో గత 2 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ కూడా చెల్లింపుల పెరుగుదలకు తోడ్పడింది.
యూపీఐ పేమెంట్ల సంఖ్యతోపాటు వాటి విలువ కూడా క్రమంగా పురోగమిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2022లో 46 బిలియన్లకుపైగా లావాదేవీలు నమోదవ్వగా వీటి విలువ ఏకంగా రూ.84.17 లక్షల కోట్లకుపైగా ఉందని రికార్డులు చెబుతున్నాయి. అంటే చెల్లింపుల విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇక అంతకుముందు సంవత్సరం 22.28 బిలియన్ల లావాదేవీలు జరగగా వీటి విలవ రూ.41.0. లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. గణాంకాలను బట్టి చూస్తే ఏడాదిలోనే లావాదేవీల పరిమాణం, విలువ దాదాపు రెట్టింపయ్యాయి. దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులకు ఈ గణాంకాలు ఉదాహరణగా ఉన్నాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్ల పురోగతిని సూచిస్తున్నాయి.

Untitled Document
Advertisements