ప్రతి పౌరుడి మనుసులో జెండా మురిసేలా..

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 11:22 AM

ప్రతి పౌరుడి మనుసులో జెండా మురిసేలా..

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని.. ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు.. మొత్తం తెలంగాణ సమాజం ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 1.20 కోట్ల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీచేయాలని ఆదేశించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా'న్ని ఘనంగా నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల అమలుపై ఎంపీ కే కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులతో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 08: ప్రారంభ సమారోహం.
ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం.
ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా..
గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పారుల ఏర్పాటు.
ఆగస్టు 11: ఫ్రీడం రన్‌ నిర్వహణ.
ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల
ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి.
ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ
సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు..
ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత
నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద
కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు.
ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ.
ఆగస్టు 16: 'ఏకకాలంలో, ఎకడివారకడ 'తెలంగాణ వ్యాప్తంగా
సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం
కవి సమ్మేళనాలు,ముషాయిరాల నిర్వహణ.
ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ.
ఆగస్టు 18: ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ.
ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు,
జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీ.
ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతోపాటు
ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
ఆగస్టు 22: ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా : ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 9వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని పేర్కొన్నారు.
ఆగస్టు 8న ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం : వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని ఆగస్టు 8న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్మీ/పోలీస్‌ బ్యాండ్‌తో రాష్ట్రీయ శాల్యూట్‌.. జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్వాగతోపన్యాసంతోపాటు, అధ్యక్షుల తొలి పలుకుల తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రసంగం, వందన సమర్పణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, అన్ని జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, ఆర్మీ వాయుసేన తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులు మొత్తంగా రెండు వేల మంది ఆహూతుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.
ఈ సమీక్షా సమావేశంలో నిర్వహణ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, సీ లక్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, సీఎం కార్యదర్శులు శేషాద్రి, భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీలు ప్రియాంక వర్గీస్‌, దేశపతి శ్రీనివాస్‌, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హన్మంతరావు, టీఎస్‌ఐఐసీ ఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఐఅండ్‌పీఆర్‌ డైరెక్టర్‌ బీ రాజమౌళి, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టిసో ఈడీ యాదగిరి, జాయింట్‌ ట్రాన్స్‌ పోర్టు కమిషనర్‌ సీ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements