రేపు బంజారాహిల్స్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కేసీఆర్‌.. ప్రారంభించనున్నారు

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 01:08 PM

రేపు బంజారాహిల్స్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కేసీఆర్‌.. ప్రారంభించనున్నారు

అడుగడుగునా నిఘా పెట్టి అనుక్షణం పహారా కాస్తూ నగరవాసికి భద్రతా ఛత్రంగా నిలిచే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12లో సర్వాంగ సుందరంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను ఈ నెల 4న (రేపు) ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. సీసీసీ అందుబాటులోకి రాగానే ట్రై కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. నేరం జరిగినా, ట్రాఫిక్‌ రద్దీ పెరిగినా క్షణాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సాధారణ కెమెరాలతో పాటు, ఏఎన్‌పీఆర్‌(ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌) కెమెరాలను సీసీసీకి అనుసంధానం చేసి ఉండడంతో వేగంగా దర్యాప్తు జరుగుతుంది. దీంతో పాటు ఎవరైనా ఆపదలో ఉంటే నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌ల నుంచి వీడియోకాల్‌ చేసి పోలీసుల సహాయం పొందవచ్చు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లో నిర్మించిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆగస్టు 4న ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి పోలీసు సేవలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. అయితే ఇందులో ప్రధానమైన హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు నగరంలో ఏర్పాటైన 7.5 లక్షల సీసీ కెమెరాలను ఈ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందులో ప్రధానంగా ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌, పండుగలు, వేడుకలు, రాజకీయ పార్టీలు, ఆందోళనలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.
ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు : మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 250 ఏఎన్‌పీఆర్‌ (ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)కు అనుసంధానమై ఉంటాయి. సాధారణ కెమెరాలతో పాటు ఈ కెమెరాలను సీసీసీకి అనుసంధానం చేస్తారు. ట్రాఫిక్‌ రద్దీ ఎలా ఉంది.? ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడటానికి కారణాలేమిటి..? ఎంత సేపట్లో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ అవుతుందనే విషయాలతో పాటు ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు, అనేక విషయాలను పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌ ద్వారా సీసీసీ నుంచి చెబుతారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండి, ట్రాఫిక్‌లో ఎక్కువ సేవు చిక్కుకోకుండా వాహనదారులు అప్రమత్తమవుతారు. ఏదైనా నేరం జరిగినా, దొంగ నంబర్లు వేసుకొని తిరిగే వాహనాలను ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తాయి. ఆయా కూడళ్ల నుంచి వచ్చే వాహనాలను లెక్కిస్తూ , ఎప్పటికప్పుడు డాటాను అందిస్తుంటాయి.
కాయిన్‌ బాక్స్‌తో కాల్స్‌ : ఎమర్జెన్సీగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే అలాంటి వారి సమస్యలను తెలుసుకోవడం కోసం నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌లు ఉన్నాయి. కాయిన్‌ బాక్స్‌ల మాదిరిగా ఉంటూ ఫోన్‌తో వీడియోకాల్‌ చేసే అవకాశముంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఫోన్‌ బాక్స్‌ వద్దకు వెళ్లి సీసీసీకి ఫోన్‌ చేయవచ్చు. పోలీసులు కూడా ఎక్కడి నుంచి కాల్‌ వచ్చిందనే సమాచారం తీసుకొని, నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి తగిన సహాయం చేస్తారు.
సోషల్‌ మీడియాకు ప్రత్యేక వింగ్‌ : సోషల్‌మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, పుకార్లు కొన్నిసార్లు ప్రజలను భయాందోళన కల్గించేవిధంగా ఉంటాయి. వర్గాలు, వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించేవిగా ఉంటాయి. ఇలాంటి పోస్టులతో ప్రశాంతతకు భంగం కల్గుతుంది. సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించే వారు అధికంగా ఉన్నారు. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు సీసీసీలో కొత్తగా సోషల్‌మీడియా విభాగాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వింగ్‌ సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉంటుంది.
శాంతి భద్రతలకు వెన్ను దన్నుగా : శాంతి భద్రతల పోలీసులకు సీసీసీ వెన్ను దన్నుగా నిలుస్తుంది. సీసీ కెమెరాలు ఒకే చోట ఉండటం, ఎక్కడైనా.., ఏదైనా ఘటన జరిగిందంటే వెంటనే సీసీసీ నుంచి స్థానిక పోలీసులకు కావాల్సిన సమాచారం ఇక్కడి నుంచి అందుతుంది. సీసీ కెమెరాల విశ్లేషణ చేస్తారు. కిడ్నాప్‌, ఇతరత్రా నేరాలు చేసి పరారవుతున్నారంటే వెంటనే మూడు పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు సీసీసీ నుంచి సందేశాలు వెళ్తాయి.
దీంతో పాటు ఏ రూట్‌లో నుంచి కిడ్నాపర్లు, దొంగలు వెళ్లారనే సమాచారం తీసుకొని ఆ రూట్‌లోని కెమెరాలన్నింటినీ ఒకేసారి తనిఖీ చేస్తారు. దీంతో వేగంగా ఫలితాలు రావడంతో కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతుంది. నేరం చేసి వెళ్లే వ్యక్తులకు సంబంధించిన వాహనం నంబర్‌ను గుర్తించారంటే, ఆ నంబర్‌ను సీసీసీకి పంపిస్తారు. దీంతో ఆ నంబర్‌ను సర్వర్‌లో ఉంచడంతో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఉన్న చోట ఆ వాహనం వెళ్లిందం టే వెంటనే సీసీసీకి సమాచారం వస్తుంది. దీంతో స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి నేరస్తులను పట్టుకుంటారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది.
రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు : నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో 4వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రూట్‌లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపారు.

Untitled Document
Advertisements