అమెరికా వెళ్లడం కోసం యువకుడు ఫేక్ సర్టిఫికెట్లతో.. కానీ చివరికి ఇలా బుక్ అయ్యాడు..

     Written by : smtv Desk | Thu, Aug 11, 2022, 11:47 AM

అమెరికా వెళ్లడం కోసం యువకుడు ఫేక్ సర్టిఫికెట్లతో.. కానీ చివరికి ఇలా బుక్ అయ్యాడు..

అమెరికా వెళ్లడం అనేది యువత కల. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు కొందరు ఉంటారు. మంచి ఉద్యోగం కోసం ఫారిన్ వెళ్లాలనుకునే వాళ్లు మరికొందరు ఉంటారు. అయితే అమెరికా వెళ్లడమే ద్యేయంగా పెట్టుకునే వాళ్లు కూడా ఇంకొందరు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉండడంలో ఇబ్బందేం లేదు కాని వాటిని చేరుకోవడానికి ఎంచుకునే ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారనేది ముఖ్యం. కొందరు ఎలాగైన అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో అడ్డదార్లు తొక్కుతున్నారు. బంగారం లాంటి తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.
అమెరికా వెళ్లాలనే మోజులో ఓ హైదరాబాదీ చేసిన ఘనకార్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నగరంలోని నాచారానికి చెందిన జంగా దయాకర్ రెడ్డి అనే పాతికేళ్ల యువకుడు బీటెక్ మధ్యలోనే మానేశాడు. అయితే తాను ఎలాగైన అమెరికా వెళ్లాలనే కోరికను మాత్రం చంపుకోలేక అడ్డదార్లు తొక్కాడు. నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించి అమెరికా వెళ్లడానికి ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు బుధవారం దయాకర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి దగ్గర నుంచి ఐదు ఫేక్ సర్టిఫికెట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
నేరస్తులతో చేతులు కలిపి : జంగా దయాకర్‌రెడ్డి 2018లో ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతూ మధ్యలోనే మానేశాడు. అప్పటి నుంచి ఎలాగైన ఇండియా వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అందుకోసం నకిలీ సర్టిఫికెట్లు సృష్టించే ఓ ఏజెంట్ మున్ను స్వామిని పరిచయం చేసుకున్నాడు. అతని సాయంతో అమెరికా వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నట్లుగా రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. దయాకర్‌రెడ్డికి మున్ను స్వామి నకిలీ సర్టిఫికెట్లు , ఇంజనీరింగ్ కాలేజీ సిఫార్సు లేఖలు, లోన్ మంజూరు లేఖ తోపాటు ఇతర అవసరమైన పత్రాలను క్రియేట్ చేసి ఇచ్చాడు. అందుకుగాను దయాకర్ నుండి 1.3 లక్షలు వసూళ్లు చేశాడు.
కటకటాల పాలైన హైదరాబాదీ : నిందితుడు దయాకర్ బిజినెస్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ కోర్సు చేయడానికి అమెరికాలోని అనేక యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందాడు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ కన్సల్టెంట్ల నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా వీసా లభించలేదు. దయార్ రెడ్డి సర్టిఫికెట్లు నకిలీవి కావడంతో విసా రిజెక్ట్ చేశారు వీసా అధికారులు. దీంతో మనోడి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసు విచారణలో మున్ను స్వామిపై గతంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో నకిలీ సర్టిఫికెట్ల సంబంధించి కేసు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం దయాకర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మున్నుస్వామి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుతో పాటు నగరంలో ఈవిధంగా ఫేక్ సర్టిఫికెట్లు సప్లై చేసే వారిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఇందుకోసం ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements