పప్పు ధాన్యాల్లోని పోషక విలువలు..

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 04:02 PM

పప్పు ధాన్యాల్లోని పోషక విలువలు..

ఆహారంలో కూరగాయలతోపాటు పప్పు ధాన్యాలు కూడా తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. పప్పు ధాన్యాలు, లెగ్యూమ్స్ కుటుంబంలోని మొక్కల విత్తనాలుగా ఉంటాయి. ఇవి వివిధ పరిమాణాల్లో, ఆకారాలు మరియు రంగుల్లో ఉంటూ, అధిక స్థాయిలో ప్రోటీన్, ఫైబర్, మరియు వివిధ రకాల విటమిన్లతో కూడుకుని ఉంటాయి. మరియు అవసరమైన మొత్తంలో అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉండి, మీ శరీర విధులకు సహాయకారిగా ఉంటాయి. పప్పు ధాన్యాలు, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉండే సపోనిన్స్, ఫైటోకెమికల్స్ మరియు టానిన్లను కూడుకుని మీ ఆహారంలో అత్యుత్తమ నాణ్యతను అందివ్వగలుగుతుంది. సెలైక్ డిసీజ్, మలబద్దకం, ఊబకాయం వంటి సమస్యలకు ఉత్తమంగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో మరియు తరువాత తల్లులకు అవసరమైన ఫోలేట్ మరియు ఐరన్ స్థాయిలు అధిక మొత్తాలలో ఉండటం వల్ల పప్పు ధాన్యాలు తీసుకోవలసిందిగా గర్భిణీ స్త్రీలకు సలహా ఇవ్వబడుతుంది.
అయితే ఇటీవలి కాలంలో పప్పు ధాన్యాలను ప్రాసెస్‌ చేయడం, నకిలీలు, కల్తీలు కలపడం వంటివి పెరిగిపోయాయి. దీనికితోడు పప్పు ధాన్యాలను వినియోగించే తీరుతోనూ వాటిలోని పోషకాలు మనకు సరిగా అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలను తీసుకునే విషయంలో ఐదు జాగ్రత్తలు పాటిస్తే పోషకాలు బాగా అందుతాయని సూచిస్తున్నారు.
* పాలిష్ చేయని ధాన్యాలు తీసుకోండి : పప్పు ధాన్యాల్లో గణనీయ స్థాయిలో ప్రోటీన్లు లభిస్తాయి. ముఖ్యంగా శాఖాహారులకు ప్రోటీన్లు ఎక్కువగా పప్పు ధాన్యాల నుంచే అందుతాయి. అయితే పప్పు ధాన్యాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటిపైన పొట్టు తొలగించి పాలిష్ చేస్తారు. అందువల్ల పాలిష్ చేయని పప్పు ధాన్యాలు తీసుకోవాలని, అందువల్ల ప్రోటీన్లు సరిగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
* నాణ్యమైన, మంచి ఉత్పత్తులను వినియోగించండి : పప్పు ధాన్యాలకు సంబంధించి నాణ్యమైన ఉత్పత్తులను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి కంపెనీలు, బ్రాండ్లవి కొనుగోలు చేయాలని.. కొన్ని కంపెనీలు నాసిరకాల ఉత్పత్తులను, పాడైపోయిన ఉత్పత్తులను పాలిష్ చేసి, మెరుగుపెట్టి అంటగడతాయని వివరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఉన్న మంచి పప్పు ధాన్యాల నుంచి పోషకాలు సరిగా అందుతాయని స్పష్టం చేస్తున్నారు.
* వేర్వేరు రకాల పప్పులను తీసుకోండి : పప్పులు, ఇతర కాయ ధాన్యాల్లో వేర్వేరు వాటిలో వేర్వేరు ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అందువల్ల ఆహారంలో వేర్వేరు రకాల పప్పులు, కాయ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలా వేర్వేరు ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వివరిస్తున్నారు.
* వివిధ రకాలుగా సిద్ధం చేసుకుని తీసుకోండి : పప్పులు, కాయ ధాన్యాలను రోజూ ఒకే తరహాలో తీసుకోవడం వల్ల వాటిపై ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల వివిధ రకాలుగా సిద్ధం చేసుకుని తీసుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల సలాడ్ల రూపంలో తీసుకోవాలని.. వేర్వేరు రకాల పప్పులను కలిపి ఉడికించుకుని స్నాక్స్ గా నూ తీసుకోవచ్చని వివరిస్తున్నారు. అవసరమైతే ఒకే కర్రీలో వేర్వేరు రకాల పప్పులను కలిపి వండుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
* రోజూ ఒక పూట అయినా తీసుకోండి : పప్పు ధాన్యాలను రోజులో కనీసం ఒక పూట అయినా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శాఖాహారులు ఈ పద్ధతిని పాటించాలని చెబుతున్నారు. వారికి కూరగాయల నుంచి ఇతర పోషకాలు అందినా.. ప్రోటీన్లు, కొన్ని రకాల విటమిన్లు మాత్రం పప్పుల నుంచే అందుతాయని చెబుతున్నారు.

Untitled Document
Advertisements