ఏపిలో దసరా లోపు స్టార్‌ లైనర్‌ బస్సులు.. ఎండీ ద్వారకా తిరుమలరావు

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 05:38 PM

ఏపిలో దసరా లోపు స్టార్‌ లైనర్‌ బస్సులు.. ఎండీ ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్ లో నాన్ ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ‘స్టార్ లైనర్’ పేరుతో పిలుస్తున్న ఈ బస్సులను దసరా పండగ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వివిధ మార్గాల్లో మొత్తం 62 స్టార్ లైనర్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఈ బస్సులు నడుపుతున్నామని.. మంచి స్పందన వస్తే బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు. ఫలితాలు బాగా లేకుంటే, పాత పద్ధతినే అమలు చేస్తామని తెలిపారు. సరికొత్త విధానంలో ప్రయోగాత్మకంగా ఈసారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే 0866-2570005 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని ఎండీ సూచించారు.
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4,100 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. వాటిల్లో అదనంగా 50శాతం ఛార్జీలు సైతం వసూలు చేయడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
ఆమోదం అనంతరమే పెంచిన వేతనాలు : ఆర్టీసీ ఉద్యోగులకు పెంచిన పీఆర్‌సీకి అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదోన్నతులు పొందిన 2వేల మంది ఉద్యోగులకు అక్టోబర్‌లో పాత వేతనాలే ఇవ్వనున్నట్లు చెప్పారు. పదోన్నతుల ఆమోదం అనంతరమే ఉద్యోగులకు పెంచిన వేతనాలు చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements