బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు సరికొత్త ప్రయోగంతో తెలంగాణ ఆర్టీసీ

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 05:49 PM

బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు  సరికొత్త ప్రయోగంతో తెలంగాణ ఆర్టీసీ

ఆర్టీసీ బస్సులు నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హైటెక్ బస్సులు రావడం, ట్రావెలింగ్ టైమ్ తగ్గించేందుకు వేగం పెంచడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో యాక్సిడెంట్లు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలను నివారించడానికి సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు. అడ్వాన్స్‌డ్ ఏఐ కెమెరాలతో ప్రమాద అవకాశాలను పసిగట్టి, డ్రైవర్లను అప్రమత్తం చేసే టెక్నాలజీ త్వరలోనే తెలంగాణ ఆర్టీసీసొంతం కానుంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు ఇంటెలిజెంట్ సొల్యూషన్​ ఫర్​ రోడ్​ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ అనే ప్రాజెక్టును తెలంగాణలో మరింతగా విస్తరించనున్నారు. ఇప్పటికే దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా నాగపూర్‌లో ప్రవేశపెట్టారు. డ్రైవర్ల డ్రైవింగ్‌ స్పీడ్‌ను ఈ సిస్టమ్ సగటున 48% తగ్గించగలిగినట్లు తేలింది.
డ్రైవర్లు చేసే అతి స్పీడ్ డ్రైవింగ్ తప్పులను అధ్యయనం చేయడానికి 50 AI-ఆధారిత కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్‌లను బస్సుల్లో అమర్చారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ , ఇంటెల్​ సంస్థ సంయుక్తంగా దీన్ని డెవలప్ చేశాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింగ్ INAI ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ బస్సుల్లో అధునాత కెమెరాలు, సెన్సార్లను అమర్చనున్నారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహకారంతో పనిచేస్తాయి. బస్సులోని సెన్సార్లు ప్రమాద కారకాలను గుర్తించిన ప్రతిసారి డ్రైవర్‌కు ఆడియో-వీడియో హెచ్చరికలను పంపుతుంది. బస్సు పరిమితికి మించి వేగంగా ప్రయాణిస్తున్నా, ముందు వెళ్తున్న వాహనానికి మరీ దగ్గరగా వెళ్లినా ఈ సెన్సార్లు సిగ్నల్ రూపంలో డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయి. దీంతో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.
ట్రిపుల్‌ఐటీ నిపుణుల టీమ్, ఆర్టీసీ అధికారులు సయుక్తంగా ఇంటెలిజెంట్ సొల్యూషన్​ ఫర్​ రోడ్​ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ప్రాజెక్టును అధ్యయనం చేయనున్నారు. ఇందు కోసం హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారులపై తిరిగే బస్సుల్లో ఈ సాంకేతికను వినియోగించనున్నారు. కాగా, ఈ ఏడాది జులై 12న మంత్రి కేటీఆర్ ఐరాస్తే ప్రాజెక్టును తెలంగాణలో ప్రారంభించారు. తొలి విడతలో 20 బస్సులకు ఈ సాంకేతికతను అమలు చేయగా, ప్రస్తుతం 80 బస్సుల్లో దీన్ని వినియోగిస్తున్నారు. ఈ నెలఖారుకి మరో 120 బస్సుల్లో ఈ టెక్నాలజీ వినియోగించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారిక డేటా ప్రకారం, గత మూడేళ్లలో రాష్ట్రంలో 1,742 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 2021-22లో మాత్రం 239 ప్రమాదాలు నమోదయ్యాయి. హైదరాబాద్ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు తాజా టెక్నాలజీ కృషి చేయనుంది తెలంగాణ ఆర్టీసీ.

Untitled Document
Advertisements