తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన రెండో అతిపెద్ద వ్యవసాయ కళాశాల..

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 06:14 PM

తెలంగాణ రాష్ట్రంలోనే  గుర్తింపు పొందిన రెండో అతిపెద్ద వ్యవసాయ కళాశాల..

పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలైతే.. రైతులు ఆ పల్లెలకు మూలస్థంబాలు. అన్నదాతల కోసం వ్యవసాయం లాభసాటిగా మార్చి వారికి అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధకులు నిత్యం కృషి చేస్తున్నారు. అటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులను తయారు చేస్తున్నదే ఈ వ్యవసాయ కళాశాల . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని వ్యవసాయ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ కళాశాలగా గుర్తింపు తెచ్చుకుంది. 1996లో ఏర్పాటైనా ఈ కళాశాలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఈ వ్యవసాయ కళాశాల.. మొదట్లో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు తీసేసి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన రెండవ అతిపెద్ద వ్యవసాయ కళాశాల ఇదే.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజీ రాష్ట్రంలోని మొదటి అతిపెద్ద కాలేజీగా గుర్తింపు ఉండగా, అశ్వారావుపేటలోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్యాలయం రెండోది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో సాగు ప్రయోగాలు, మంచి విత్తనాల తయారీ, సాంకేతిక పద్ధతులు అందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ విద్య , పరిశోధనలకు పునాదులు వేసిన కళాశాలలో ఇది ఒకటి. ఈ కళాశాల ఎందరో వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసి.. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలిచిన విద్యా సంస్థ. దేశ అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ విద్య నేర్పింది. సాగులో సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే.. ఆధునికతను ఆహ్వానిస్తూ ప్రత్యేకత చాటుకుంది ఆచార్య జయశంకర్ వ్యవసాయ కళాశాల. ఇక్కడ చదువుకున్న వారు కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు శాస్త్ర, సాంకేతిక, పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారంతా సాగు రంగానికి చేసిన సేవలు, సాధించిన ఘనతలు ఎన్ని చెపుకున్నా తక్కువే. పూర్తి గ్రామీణ వాతావరణంలో సుమారు 254 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల తోటలు, వ్యవసాయ పంట పొలాల నడుమ ఈ కళాశాల విస్తరించి ఉంది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో నాలుగు సంవత్సరాల వ్యవసాయ విద్యా కోర్సులకు గాను ప్రతి సంవత్సరం 120 మంది విద్యార్థులను ఎంసెట్ ర్యాంక్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తారు. కళాశాలకు కూతవేటు దూరంగా ఉన్న మద్దికుంట అనే గ్రామాన్ని కళాశాల తరుపున దత్తత తీసుకొని అక్కడి రైతులకు సాగులో మెళుకువలు, తక్కువ శ్రమ పెట్టుబడితో అధిక పంట దిగుబడి వచ్చే విధంగా ఈ కాలేజీ విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలోని పరిశోధన కేంద్రంలో మామిడి, జీడి మామిడి, పామాయిల్ తదితర పంటల విషయంలో రైతులకు శిక్షణ తరగతులను సైతం ఇస్తుండడం గమనార్హం. చుట్టుపక్కల ప్రాంత రైతుల కోసం నాణ్యమైన మామిడి, జీడి మామిడి మొక్కలను సైతం అభివృద్ధి చేసి కళాశాల నర్సరీల ద్వారా తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నారు.

Untitled Document
Advertisements