తెలంగాణా రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రం పాకాల సరస్సు

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 01:51 PM

తెలంగాణా రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రం పాకాల సరస్సు

ప్రకృతి అందాలతో నిండిన పాకాల సరస్సు మానవ నిర్మితం అంటే నమ్మడం కాస్త కష్టమే కదా. అయితే ఈ అరుదైన వృక్షసంపదతో నిండిన ఈ అభయారణ్యం ఎన్నో అరుదైన జంతువులకు విడిది కేంద్రం. వలస పక్షుల కిలకిలారావాలను మనసారా ఆస్వాదించాలనుకునే పక్షి ప్రేమికులకు పాకాల అభయారణ్యం సర్గధామంలాంటిది.
తెలంగాణా రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా పేరొందింది పాకాల సరస్సు. దీనిని మరింత ప్రమోట్‌ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఇతర పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు పాకాల వన్యప్రాణుల అభయారణ్యంలో నైట్ క్యాంపింగ్ మరియు జంగిల్ సఫారీని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు, గుంపులుగా సంచరించే కోతుల బారినుంచి పర్యాటకులకు సురక్షితమైన ఆశ్రయం కల్పించే ప్రయత్నంలో పాకాల సరస్సుకి ఆనుకుని ఉన్న కొండపై ఏడు ఎకరాల ప్రదేశంలో పలు సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు.
అటవితోపాటు సరస్సు ఆవరణలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరస్సు వద్ద బోటింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు జరుపుతున్నారు. నర్సంపేట పట్టణానికి 10 కిలోమీటర్లు, వరంగల్ నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల సరస్సు మనదేశంలోని కొన్ని కాలుష్య రహిత సరస్సులలో ఒకటిగా పేరుగాంచింది.
ఈ సరస్సు క్రీస్తుశకం 1213లో కాకతీయులచే గణపతిదేవుని కాలంలో త్రవ్వబడింది. ఈ కొండ ప్రాంతాన్ని అభయారణ్యంగా 1952లో గుర్తించారు. మనోహరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆహ్లాదపరుస్తాయి. విశాలమైన పాకాల సరస్సు వద్ద విహారం చేయకుండా వరంగల్ పర్యటన పూర్తి కాదంటే ఆశ్చర్చపోవక్కర్లేదు.
పాకాల వన్యప్రాణుల అభయారణ్యం, సరస్సు ఆనుకుని 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది వన్యప్రాణులు నీల్‌గాయ్, చితాల్, చిరుతపులి, నక్క, ఎలుగుబంటి మరియు బోనెట్ మకాక్‌లకు కూడా నివాసం. ఈ ప్రదేశంలో కొండచిలువలు, నాగుపాములు, వైపర్‌లు, క్రైట్‌లు మరియు భారతీయ ఊసరవెల్లులు కూడా ఉన్నాయి. చాలా నెలల క్రితం అభయారణ్యంలో ఒక పులి కూడా సంచరించినట్లు చెబుతారు. రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, పెయింటెడ్ కొంగ, ఓపెన్ బిల్డ్ కొంగ, జకానాస్, గార్గేనీతోపాటు 70 జాతుల పక్షులను ఇక్కడ గుర్తించారు.
శీతాకాలంలో సరస్సు సమీపంలోని విస్తృతమైన గడ్డి భూములు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. ఈ సీజన్‌లో మచ్చల జింక, నాలుగు కొమ్ముల జింక, అడవి పంది మరియు కృష్ణజింకలతో సహా జంతు జాతులు అరుదుగానే కనువిందు చేస్తాయి. వలస పక్షుల కిలకిలారావాలు ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తాయి. పర్యాటక శాఖ ఈ సరస్సు వద్ద సందర్శకులు విడిది కోసం గుడారాల కాటేజీలు మరియు రెస్టారెంట్‌ను నిర్మించింది. సరస్సు చుట్టూ కొండ భూభాగం మరియు దట్టమైన అడవితో నిండి ఉంటుంది. ఇది నేటికీ కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. కాగా అక్కడికి వెళ్ళాలంటే.. హైదరాబాద్ నగరం నుండి రోడ్డుమార్గంలో పాకాల వన్యప్రాణుల అభయారణ్యం 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు తమ బస్సులను నడుపుతుంటారు. ఇక్కడికి వరంగల్ సమీప రైల్వే స్టేషన్. రైలులో వరంగల్ చేరుకుని, అక్కడి నుంచి సరస్సుకు బస్సులో చేరుకోవచ్చు.





Untitled Document
Advertisements