లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టిబడిన వీఆర్వో..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 03:06 PM

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టిబడిన వీఆర్వో..

లంచం ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం డబ్బుల రూపంలో గానీ లేదా బహుమతుల రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, ఆస్తి రూపంలో, ఓటు, లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని 'లంచగొండి' అంటారు. ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పొలం పాసు పుస్తకాలు మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ వీఆర్వో అడ్డంగా దొరికాడు. ఒకే కుటుంబంలో ఉమ్మడి భూమి పంపకం కారణంగా మ్యుటేషన్ కోసం స్థానిక రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎం. బెన్నవరం వీఆర్వో జి.సూర్యనారాయణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం బెన్నవరంకి చెందిన స్థానిక రైతు జి.శ్రీనివాసరెడ్డి సర్వే నంబరు 119లోని భూమిని తమ కుటుంబ సభ్యులకు పంచి పాసు పుస్తకాలు ఇవ్వడానికి ఏడాదిగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు.
దీనికి వీఆర్వో రూ.25 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన రైతు శ్రీనివాస రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రైతుకు ఏసీబీ అధికారులు రూ.20 వేలు ఇచ్చి వీఆర్వో దగ్గరికి పంపారు. ఆ సొమ్మును పక్కన ములగపూడి సచివాలయం ఆవరణలో రైతు నుంచి వీఆర్వో తీసుకుంటున్న సమయంలో ఏ.సి.బి అధికారులు పట్టుకున్నారు.
ఇదంతా అదనపు ఎస్పీ షకీలాబాను ఆధ్వర్యంలో ఆపరేషన్ నడిపి పట్టుకునట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌లు రమేష్, ప్రేమకుమార్, విజయకుమార్, సతీష్ కుమార్, శ్రీనివాస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఒక్క నాతవరం మండలంలోనే ఇతర శాఖలతో పోల్చితే రెవెన్యూ శాఖలోనే అవినీతి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. నాతవరంలో చూసుకుంటే గత 15 ఏళ్లుగా నలుగురు వీఆర్వోలు, ఒక తహసీల్దార్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఈ పరిధిలో రెవెన్యూ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు లంచాలు లేనిదే ఫైలు కదపరని పలువురు రైతులు కూడా ఆరోపిస్తున్నారు.
ఏడాదిగా తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని రైతు శ్రీనివాస్ తెలిపారు. రూ.25 వేలు డిమాండ్ చేసి, ఆ మొత్తం డబ్బు ఇచ్చే వరకు పని చేయనంటూ చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించానని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తమ విధులు తాము చేయకుండా అమాయక ప్రజలను లంచాల కోసం కొంత మంది అధికారులు రాబందుల్లా పీక్కుతింటున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏ పని చేయాలన్నా ఒక రేటు… చేయి తడవనిదే ఆ పని ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ ప్రభుత్వ శాఖల అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారు. ఇలా అయితే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా పనులు చేయించుకోవాలంటూ లబోదిబోమంటున్నారు.





Untitled Document
Advertisements