తెలంగాణలో ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ వాళ్లకే..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 04:07 PM

తెలంగాణలో ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ వాళ్లకే..

రాష్ట్రంలో ఉంటూ డాక్టర్ కోర్సులు చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మైనారిటీ, మైనారిటీయేతర వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ బీ కేటగిరీ సీట్లలో 35 శాతం సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్ 129, 130లను గురువారం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,068 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 20 మైనారిటీ, 4 నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 3,750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా, 35 శాతం అంటే 1120 సీట్లు బీ కేటగిరీ కింద ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు వీటికి అర్హులు. తాజా సవరణ ప్రకారం బీ కేటగిరీలోని 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించబడతాయి. మిగిలిన 15 శాతం (168) సీట్లను మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అనుమతించారు. ఓపెన్ కోటా కావడంతో తెలంగాణ విద్యార్థులకు కూడా ఇందులో అవకాశం ఉంది. అదే విధంగా మైనారిటీ కళాశాలలో ఇప్పటి వరకు 25 శాతం బి కేటగిరీలో 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ లేదు. బీ కేటగిరీలో 35 శాతం కోటాలో స్థానిక రిజర్వేషన్ లేకపోవడంతో ఇక్కడి కాలేజీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఎంబీబీఎస్ సీట్లు పొందుతున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే బీ కేటగిరీ సీట్లలో స్థానిక రిజర్వేషన్లను 85 శాతానికి పెంచి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టింది. మెడికల్ విద్య చదువుకోవాలనుకునే ఎందరో విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పించింది.





Untitled Document
Advertisements