భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఇది గమనించండి..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 04:29 PM

భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఇది గమనించండి..

ప్రస్తుత ఫెస్టివల్ సీజన్ లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్,ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ అన్నీ పోటాపోటీగా ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇదే చక్కటి అవకాశం అని భావించి తమకు నచ్చిన ప్రోడక్ట్ కొనుగోలు చేస్తున్నారు కాని ఆ ప్రోడక్ట్ తెరిచి చూసేవరకు అందులో వేరే వస్తువులు ఉంటున్ని అలంటి సంఘటన.. బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మీషో లో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశాడు. కానీ తనకు వచ్చిన డెలివరీ బాక్సులో ఉన్న వస్తువును చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే డెలివరీ బాయ్ అతడికి ఒక కిలో బంగాళదుంపల ను డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నలంద ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త చేతన్ కుమార్ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మీషో లో డబ్బులు చెల్లించి డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలోనే డ్రోన్ కెమెరా బాక్సు డెలివరీ‌ ఇచ్చేందుకు డెలివరి ఏజెంట్ వచ్చాడు. బాక్సు చూడగానే అనుమానపడ్డ చేతన్, డెలివరీ బాయ్‌తోనే దాన్ని ఓపెన్ చేయించాడు. బాక్సు సీల్ తీసి అన్‌బాక్సింగ్ చేస్తుండగా అదంతా వీడియో తీశాడు. ఇక బాక్సులో డ్రోన్ కెమెరాకు బదులుగా ఒక కిలో ఆలుగడ్డలు ఉండటం చూసి చేతన్ ఆశ్చర్యపోయాడు.
తాను డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశానని, బంగాళదుంపలు ఎందుకు వచ్చాయని చేతన్.. డెలివరీ బాయ్‌ని ప్రశ్నించాడు. మీషో కంపెనీ తనను మోసం చేసిందని చెబుతూ, డెలివరీ బాయ్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తాను సెల్లర్ కాదని కేవలం డెలివరీ మాత్రమే చేస్తానని ఏజెంట్ తెలిపాడు.
డ్రోన్ కెమెరాకు బదులు బంగాళదుంపలు వచ్చిన సంగతి మీషో కంపెనీకి తెలిపేందుకు చేతన్ ఆ వీడియోను కంపెనీకి షేర్ చేశాడు. అన్‌సీన్ ఇండియా అనే ట్విట్టర్ అకౌంట్‌లో దీన్ని ట్వీట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మీషో.. కస్టమర్‌కు ఊహించని షాక్ ఇచ్చిందని అంటున్నారు. మీషో తన కస్టమర్ చేతన్ కుమార్‌ను మోసం చేసిందని పేర్కొంటున్నారు. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే కంపెనీ మరొకటి పంపడం ఏంటని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఈ విషయంపై మీషో ఇంకా స్పందించలేదు. గతంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేయగా, అతనికి సబ్బులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరలయింది. ప్రస్తుతం డ్రోన్ కెమెరాకు బదులుగా ఆలుగడ్డలు ప్యాక్ చేసి వచ్చిన వీడియో వైరలవుతోంది కావున ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు అప్రమత్తంతో ఆ ప్రోడక్ట్ ముందుగానే చెక్ చేసుకోవాలని కోరుతున్నారు లేదంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి అని పేర్కొన్నారు.
https://twitter.com/USIndia_/status/1574447545228865536





Untitled Document
Advertisements