‘దృశ్యం’ సినిమా ప్రభావం ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసిన కూతురు

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 11:36 AM

‘దృశ్యం’ సినిమా ప్రభావం ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసిన కూతురు

కర్ణాటకలో ప్రియుడితో కలిసి కన్న తండ్రిని హతమార్చింది ఓ యువతీ. అలాగే ఆ ఘటనలో ఆమెకు తల్లి కూడా సహాయం చేసింది. ముగ్గురు కలిసి పథకం ప్రకారం చంపెసారు. ఈ హత్యలో మృతుడి భార్య కూడా భాగం కావడం గమనార్హం. తల్లీకూతుళ్లు పోలీసులకు దొరక్కుండా ఉండటానికి దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇద్దరూ ఒకేలా సమాధానం చెప్పడంతో కేసులో ముందుకు వెళ్లడం పోలీసులకు కష్టంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం బెళగావీకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధీర్‌ కాంబళె (57) ఇటీవల హత్యకు గురయ్యారు. గతంలో దుబాయ్‌లో పని చేసిన సుధీర్.. కరోనా సమయంలో బెళగావిలోని క్యాంప్‌ ఏరియాలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు.
సుధీర్‌ తన భార్య రోహిణి, కుమార్తె స్నేహతో కలిసి బెళగావీలో ఉంటున్నాడు. సుధీర్ కుమార్తె స్నేహ పుణెలో చదువుతుండగా అక్షయ్‌ విఠకర్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. కుమార్తె ప్రేమ వ్యవహారం సుధీర్‌‌కు ఇటీవలే తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో తండ్రిపై కోపాన్ని పెంచుకున్న స్నేహ తమ ప్రేమకు అడ్డుగా ఉన్న అతడ్ని తప్పించాలని భావించింది. ఈ విషయం తల్లికి చెప్పడంతో కుమార్తెను మందలించాల్సింది పోయి ఆమె కూడా హత్యకు ప్రోత్సహించింది.
పథకం ప్రకారం ప్రియుడు అక్షయ్‌ను పుణె నుంచి బెళగావికి రప్పించి ఓ లాడ్జిలో ఉంచింది. సుధీర్ తన ఇంటిలోని పై అంతస్తులో నిద్రపోతుండగా తెల్లవారుజామున అక్షయ్‌ను తల్లీకూతుళ్లు ఇంటికి పిలిపించారు. సుధీర్‌ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా అక్షయ్ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. కడుపు, గొంతు, చేతులు, మొహంపై పలుసార్లు పొడిచి చనిపోయాడని ధ్రువీకరించుకున్నాక అక్షయ్‌ పుణెకు తిరిగి వెళ్లిపోయాడు.
సుధీర్ భార్య ఏమీ తెలియనట్టు తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పోలీసులు ఎలా అడిగినా ఇద్దరూ ఒకేరకమైన సమాధానాలు చెప్పడంతో అవాక్కయ్యారు. అనుమానంతో తల్లీకుమార్తెల ఫోన్‌కాల్స్‌పై పోలీసులు నిఘా పెట్టారు. స్నేహ నుంచి తరుచూ పుణేలోని ఓ నెంబరు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో స్నేహను విచారించడంతో అసలు విషయం బయటపడింది. ప్రేమకు అడ్డు చెప్పారనే కారణంతో తామే హత్య చేసినట్టు అంగీకరించారు.
బెళగావీ జిల్లా ఎస్పీ సంజీవ్ పాటిల్ మాట్లాడుతూ హత్యను తామే చేసినట్టు పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసినట్లు విచారణలో ఒప్పుకొన్నారని వివరించారు. నిందితులు రోహిణి కాంబళె, స్నేహ, ఆమె ప్రియుడు అక్షయ విఠకర్‌లనూ గురువారం అరెస్టు చేశామని తెలిపారు.





Untitled Document
Advertisements