పోనిలే పాపం అంటి చోటిస్తే బంగారంతో ఉడాయించిన లేడీ కేడీ

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 11:14 AM

పోనిలే పాపం అంటి చోటిస్తే బంగారంతో ఉడాయించిన లేడీ కేడీ

నాలుగున్నర తులాల బంగారంతో జంప్ అయింది ఓ మహిళ ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అనుకోకుండా ఆ ఇద్దరూ ఓ రోడ్డుపై కలిశారు. ఒంటరిగా ఉండటంతో ఆ రాత్రి ఇంట్లో చోటిచ్చి తెల్లారగానే బస్సెక్కి ఇంటికి పంపాడు. ఫోన్ సంభాషణలతో ఆ ఇద్దరి మధ్య ఇంకాస్త పరిచయం ఏర్పడింది. ఈసారి ఇంకో నాలుగు రోజులు ఉంటానని అడిగింది. పాపం పోనీలే నాలుగు రోజులు ఇంట్లో చోటిస్తే ఏకంగా బంగారంతో పరార్.
పోలీసుల కథనం మేరకు మహబూబ్‌నగర్‌లోని దొడ్డలోనిపల్లికి చెందిన నరేశ్ తన మిత్రుడు శేఖర్‌తో కలిసి ఆటోలో గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ పని చూసుకుని మహబూబ్‌నగర్‌కి వస్తుండగా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద ఓ మహిళ బైక్‌పై నిలబడి ఉంది. వారిద్దరూ ఆమె దగ్గరికి వెళ్లి ఏమైందని అడగడంతో బైక్ చెడిపోయిందని చెప్పడంతో, ఆటోలో బైక్ వేసుకుని ఆమెను మహబూబ్‌నగర్ తీసుకొచ్చారు. తన పేరు నాగమణి అలియాస్ జానుగా పరిచయం చేసుకున్న ఆమె ఆ రోజు రాత్రి నరేశ్ ఇంట్లోనే ఉంది. పొద్దున్నే మహిళ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేటకు పంపించారు. అప్పటి నుంచి నరేశ్‌తో నాగమణి తరచూ మాట్లాడేది. వీరిద్దరి మధ్య పరిచయం ఇంకాస్త పెరిగింది. ఆగస్టు 28న తనకు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఉందని అందుకోసం ఓ నాలుగు రోజులు ముందొచ్చి అక్కడ ఉంటానని అడగడంతో నరేశ్ సరే అన్నాడు. 24న మహబూబ్‌నగర్ వచ్చిన మహిళ 28వ తేదీ వరకు నరేశ్ ఇంట్లో ఉంది. 28వ తేదీన నరేశ్ తన భార్యతో కలిసి హాస్టల్‌లో ఉంటున్న పిల్లలను కలిసేందుకు యాదాద్రి వెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసిన నాగమణి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారం, రూ.10 వేల నగదు, వెండి తీసుకుని పరారైంది.
యాదాద్రి నుంచి ఇంటికి వచ్చే సరికి బీరువా తలుపు తెరిచుండటం బంగారం కనిపించకపోవడంతో నరేశ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నాగమణిపైనే అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 30వ తేదీన మెట్టుగడ్డ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో నాగమణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి నాలుగున్నర తులాల బంగారం, స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై గతంలో కడప జిల్లా సిద్ధవటంలో కూడా కేసు నమోదైందని చెప్పిన పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.





Untitled Document
Advertisements