తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సంచలన వాక్యాలు...

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 05:14 PM

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సంచలన వాక్యాలు...

తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చేస్తోన్న ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల ఎప్పుడనేది అర్థంకాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి సెప్టెంబర్ లోనే ఫలితాలు విడుదల కానుండగా ఇప్పటివరకు ఆ ముచ్చటే ఎక్కడ వినిపించడం లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను తగ్గిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతోనే ఫలితాల వెల్లడికి అడ్డంకిగా మారిందన్నప్రచారం సాగుతోంది. ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వస్తేనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఫలితాల విడుదలపై ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. 554 ఎస్సై స్థాయి ఉద్యోగాలకు ఆగస్టు 7న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2,47,217 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదే నెల 28వ తేదీన 16,321 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన నియామక పరీక్షల్లో 200 మార్కులకు గానూ జనరల్‌ అభ్యర్థులకు 80, బీసీలకు 70 ఎస్సీ, ఎస్టీలకు 60గా కటాఫ్ మార్కులను ఈ సారి మాత్రం కేటగిరీలతో సంబంధం లేకుండా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 60 మార్కులనే కటాఫ్‌గా నిర్ణయించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీంతో అన్ని వర్గాల వారికి కటాఫ్ మార్కులు తగ్గించి తమకు తగ్గించకపోవడంతో నష్టపోతున్నామని ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. వీరికి రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు మద్దతును ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసహరించుకుంది. ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాల విడుదలపై ఆలోచనలో పడింది. నోటిఫికేషన్‌కు భిన్నంగా ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులను తగ్గిస్తే న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయా అన్న కోణంలో ఆలోచనలు చేస్తోంది బోర్డు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న అంశంపై బోర్డు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్లు విడుదలైన నాటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. సెప్టెంబర్ లో ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసి అక్టోబరు రెండోవారంలో ఫిజికల్ టెస్టులు నిర్వహించాలని భావించింది. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఫైనల్ టెస్ట్ నిర్వహించాలని భావించింది. అనుకున్న సమయంలో ఫైనల్ టెస్ట్ ముగిస్తే మార్చిలోపు తుది ఫలితాలను ప్రకటించాలన్నది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆలోచన. అయితే కటాఫ్ మార్కుల తగ్గింపు కారణంగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలే నేటికీ విడుదల కాకపోవడంతో ప్రక్రియ మరింత ఆలస్యంగా ముగిసే అవకాశం ఉంది. న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా ఒకటి లేదా రెండు వారాల్లోనే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements