కిరాయి కట్టలేదని కడప పాతబస్టాండ్ క్లోజ్ చేసిన కార్పొరేషన్..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:15 AM

కిరాయి కట్టలేదని కడప పాతబస్టాండ్ క్లోజ్ చేసిన కార్పొరేషన్..

కడప పాత ఆర్టీసీ బస్టాండ్‌కు ఒక్క సారిగా కార్పొరేషన్ అధికారులు తాళం వేసేశారు. దీంతో బస్సులన్నీ బయటే ఉండిపోయాయి. రోడ్డు మీద నుంచే ప్రయాణికుల్ని ఎక్కించుకుని బయలుదేరుతున్నాయి. అయితే అసలు కార్పొరేషన్ అధికారులు ఎందుకు తాళాలు వేశారా అని ఆరా తీసిన జనానికి షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేమింటే ఆ ఆర్టీసీ బస్టాండ్.. ఆర్టీసీది కాదు. కార్పొరేషన్‌ది. నెలా నెలా అద్దె కడతామని బస్టాండ్ తీసుకున్నారు. కానీ కట్టడం లేదు. చూసీ చూసీ చిరాకేసి.. అడిగి అడిగి ఇక అడగలేక నేరుగా ఆర్టీసీ బస్టాండ్‌కు తాళాలేసేశారు.
ఇటీవల పులివెందుల బస్టాండ్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు మూడేళ్లలో బస్టాండ్ కూడా కట్టలేదని.. గ్రాఫిక్స్ మాత్రమే రిలీజ్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సొంత జిల్లా కడపలో బస్టాండ్ అద్దె కట్టలేదని తాళాలేయడంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారికి మరో అస్త్రం దొరికినట్లయింది. సీఎం సొంత జిల్లా కావడమే కాదు.. ఆర్టీసీ స్టేట్ ఛైర్మన్ సొంత జిల్లా కూడా కడపే. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యారు. కార్పొరేషన్ తరపున ఉద్యోగులు లేరు. కానీ బస్సులు మాత్రం కార్పొరేషన్ తరపునే నడుస్తున్నాయి. కడప పాత బస్టాండ్‌ను నగరపాలక సంస్థ నిధులతో నిర్మించారు. అక్కడ ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేసేందుకు ప్రతినెల ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తారు.2013 నుంచి ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు దాదాపు రెండు కోట్ల 30 లక్షల రూపాయలు అద్దె చెల్లించలేదు. గతంలో నగరపాలక అధికారులు పట్టించుకోకపోవడంతో ఇది పెరుగుతూ పోయింది. కొత్తగా వచ్చిన కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ అద్దె చెల్లించాలని ఆర్టీసీ అధికారులకు నోటీసులు ఇచ్చారు.
కానీ ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఇక చేసేది లేక నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి పాత బస్టాండ్​లోకి బస్సులను పంపకుండా బస్టాండును మూసేశారు. ఏపీలో ఇప్పటికే అద్దెలు కట్టడం లేదని గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటికి తాళాలేస్తున్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి. ఈ సారి నేరుగా ఆర్టీసీ బస్టాండ్‌కే అద్దె కట్టకపోవడంతో తాళాలేసిన పరిస్థితి. ఈ అంశం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. రెండు ప్రభుత్వ సంస్థలే కావడంతో.. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.





Untitled Document
Advertisements