జాతీయ పార్టీ పెడుతున్న వేళ కేసీఆర్‌కు మునుగోడు సమస్యల ముప్పు..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:21 AM

జాతీయ పార్టీ పెడుతున్న వేళ కేసీఆర్‌కు మునుగోడు సమస్యల ముప్పు..

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. కొతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న కేసీఆర్.. పలు దఫాలుగా పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనల అనంతరం సీఎం కేసీఆర్ దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసిందే. అంతే కాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాను జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ప్రకటనలో తెలిపారు. కాని ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఊహించని విధంగా రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతినేతల రాగం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బహిరంగంగా అసమతి వెళ్ళగక్కిన విషయం మరవకముందే మర్రిగూడ మండలంలోని మాజీ సర్పంచులు శనివారం హైదరాబాదులోని సాగర్ కాంప్లెక్స్ లో రహస్య సమావేశం ఏర్పాటు చేయడం ప్రకంపనలు సృష్టిస్తుంది. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓపెన్ గానే కొందరు నేతలు తమ వాయిస్ వినిపించారు. రేపుమాపో బైపోల్ షెడ్యూల్ వస్తుందనే సమాచారంతో రెబెల్ నేతలు మరింత దూకుడు పెంచారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలానికి చెందిన దాదాపు 60 మంది నేతలు హైదరాబాద్ లోని సాగర్ కాంప్లెక్స్ లోని ఎస్ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
మర్రిగూడెం మండలానికి చెందిన సీనియర్ నేత మునగాల వెంకటేశ్వరరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కాట్రోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పార్టీ తీరుపై చర్చించారు. ముఖ్యంగా మంత్రి జగదీశ్ రెడ్డి, మర్రిగూడ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావుపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టార్గెట్ గానే ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావులు ఏకపక్షంగా వ్యవహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కూసుకుంట్ల అనుచరులుగా ఉన్నవారినే మంత్రి గుర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జగదీశ్ రెడ్డి తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకే తాము సమావేశం అయ్యామని మునగాల వెంకటేశ్వరరావు రాజు నాయక్ లు దిశతో చెప్పారు.
హైదరాబాద్ సమావేశంలో నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసమ్మతి నేతలు.. దసరా తర్వాత అక్టోబర్ 7న మునుగోడు నియోజకవర్గంలోనే భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి దాదాపు ఏడు వేల మంది ఈ సభకు వస్తారని చెబుతున్నారు. తాము పార్టీకి వ్యతరేకం కాదని.. పార్టీ మారే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. తాము సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరామని.. దసరా తర్వాత రమ్మని ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిందన్నారు. కేసీఆర్ తో జరగబోయే సమావేశానికి ముందు మునుగోడులో సభ పెడుతున్నామన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలను పార్టీ పెద్దలకు వివరిస్తామంటున్నారు మునగాల వెంకటేశ్వరరావు. పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం కోసమే తమ ప్రయత్నమని తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని దామెర భీమనపల్లి, సరంపేట, వట్టిపల్లి ,అజిలాపురం, కొండూరు, శివన్న గూడెం గ్రామాల మాజీ సర్పంచులతోపాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని సాగర్ కాంప్లెక్స్ లో జరిగిన అసమ్మతి నేతల సమావేశం ప్రదేశానికి మర్రిగూడ మండల ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన వెళ్లి అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. టీఆర్ఎస్ అసమ్మతినేతల సమావేశంతో అప్రమత్తమైన అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు, అసమ్మతినేతలు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. మునగాల వెంకటేశ్వరరావు జరిపిన సమావేశానికి ఎవరెవరు వెళ్లారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరా తీశారని తెలుస్తోంది. అక్టోబర్ 7న తలపెట్టిన సభను అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే మునగాల వెంకటేశ్వరరావు మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి తీరుతో ఉపఎన్నికలో పార్టీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని పార్టీ పెద్దలకు వివరిస్తామంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడమే తమ లక్ష్యమంటున్నారు మునగాల వెంకటేశ్వరరావు. మొత్తంగా హైదరాబాద్ లో రహస్యంగా టీఆర్ఎస్ అసమ్మతి నేతలు సమావేశం కావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. అభ్యర్థిని ప్రకటించక ముందే పార్టీలో రోజుకొక మలుపు తిరగడంతో అధిష్టానం తల పట్టుకుంటున్నట్లు సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.





Untitled Document
Advertisements