మందుబాబులతో ఇబ్బంది పడుతున్న మహిళలు.. మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:24 AM

మందుబాబులతో ఇబ్బంది పడుతున్న మహిళలు.. మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్

మద్యం దుకాణం కాలనీలో ఇళ్ల మధ్యలోనే ఉన్నందువల్లన అర్ధరాత్రి వరకు మద్యం లభిస్తుండడంతో తాగుతున్న మందుబాబులు దుకాణం వద్ద పదుల సంఖ్యలో చేరుతున్నారు. మత్తులో రోడ్ల మీదే ఉంటూ మహిళలకు ఇబ్బంది కలిపిస్తున్నారు. కాలనీలోని దుకాణాని తొలగించాలన్న ఆందోళనలు పెరిగింది. కాగా కాలనీలో రాత్రి 7 గంటలు దాటితే మహిళలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నట్లుగా తెలిపారు.
గోవిందరావుపేట మండల కేంద్రంలో రహదారి వెంట గత నాలుగు రోజుల క్రితం వెలిసిన మద్యం దుకాణాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆ వీధి మహిళలు డిమాండ్ చేస్తున్నారు. శనివారం మండల కేంద్రంలో మద్యం షాపు వీధి మహిళలు మీడియాతో మాట్లాడారు. గతంలో ఈ మద్యం షాపును రంగాపురం రహదారిలో స్మశాన వాటిక సమీపంలో నిర్వహించేవారని.. అప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉందని అన్నారు.
గత సోమవారం నుండి అకస్మాత్తుగా ఈ వీధిలో మద్యం దుకాణాన్ని తెరిచారని అన్నారు. అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ దారి పొడవునా భయానక పరిస్థితులు నెలకొల్పుతున్నారని వాపోయారు. గుమ్మాల ముందు ఏర్పాటుచేసిన అరుగులు గతంలో అమ్మలక్కలు ఇరుగుపొరుగువారు కూర్చొని మాట ముచ్చట చెప్పుకునేవారని ఇప్పుడు ఆ అరుగులు మద్యం ప్రియులకు సిట్టింగ్ ఆవాసాలుగా మారాయని వారన్నారు.
ఓ రాత్రి వరకు వీధి గుమ్మాల ముందు మద్యం సేవించడమే కాకుండా మూత్ర విసర్జన చేయడం మద్యం సీసాలను పగలగొట్టడం తాగిన ప్లాస్టిక్ తిన్న వ్యర్ధాలను అక్కడే పడవేయడం జరుగుతుందన్నారు. మరుసటి రోజు ఉదయం తమ ఇంటి ముందు తామే శుభ్రం చేసుకుని వాకిలి ఊకి చల్లుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. వారు తాగుతున్న సమయంలో ఇది పద్ధతి కాదంటే తాగిన మైకంలో తమనే దుర్భాషలాడుతున్నారని ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఎన్నడూ ఊహించలేదని వారు అంటున్నారు. ముందు ముందు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతకాలం అక్కడ నడిపిన షాపును అకస్మాత్తుగా ఇక్కడకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. అక్కడ ఏ ఒక్కరికి కూడా అభ్యంతరం లేకుండా నడుస్తున్న షాపును జనావాసాల మధ్యకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. వీధిలో ఆడపిల్లలు ఉన్నారని, చిన్నపిల్లలు నిత్యం అటూ ఇటూ తిరుగుతుంటారని తాగిన మత్తులో మైకంలో వాహనాలు అడ్డగోలుగా నడుపుతూ అడ్డమైన కామెంట్లు చేస్తూ ఉండడం వీధి ప్రజలకు చాలా అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. మద్యం దుకాణాన్ని ఆనుకుని స్వాతంత్ర సమరయోధుడు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు కీర్తిశేషులు వీరపనేని రామదాసు దంపతుల విగ్రహాలతో వారి నివాస గృహం ఉందని..
ఎలాంటి మాట మాత్రం చెప్పకుండా తమకు తెలియకుండా ఇక్కడ మద్యం దుకాణం తెరిచారని తెలిపారు. మరోపక్క సీనియర్ పాత్రికేయుడు ఆకుల యుగంధర్ నివాసం కూడా అక్కడే ఉందన్నారు. తాగుబోతు సమాజం అంటేనే గిట్టని పాత్రికేయుడు యుగంధర్ ను అడుగగా తనకు ఏమాత్రం తెలియకుండానే షాపులు ఇక్కడకు షిఫ్ట్ చేయడం జరిగిందని తెలిపారు. చిన్నపిల్లలు, మహిళలు , యువతులు, కామ్రేడ్లు, పాత్రికేయులు ఉన్న ఈ వీధిలో మద్యం షాపును నిర్వహించడం ఎంత మాత్రం సమంజసం కాదని.. ఆ వీధ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో జన సంచారం లేని ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించుకోవాలని లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.





Untitled Document
Advertisements