టీడీపీ నేత చింతకాయల విజయ్‌కు నోటిసులు జారీ చేసిన ఏపీ సీఐడీ

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:11 PM

టీడీపీ నేత చింతకాయల విజయ్‌కు నోటిసులు జారీ చేసిన ఏపీ సీఐడీ

శనివారం హైదరాబాద్‌లోని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌కు ఏపీ సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి ఫొటోను ‘భారతీపే’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేసినందుకు వారు విజయ్‌పై కేసు పెట్టారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో అధికారులు ఆయన పనిమనిషికి నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా సిఐడి పోలీసులు తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి బెదిరించారని విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సీఐడీ పోలీసులు తనను కొట్టారని, విజయ్ కూతురిని బెదిరించారని విజయ్ పిఎ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్‌ 6న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు చింతకాయల విజయ్‌ను నోటీసులో కోరారు. లేని పక్షంలో అరెస్టు చేస్తామని హెచ్చరించారు. విజయ్ తన మొబైల్ ఫోన్‌లన్నింటినీ విచారణకు తీసుకురావాలని, విచారణ చేస్తున్న అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు. సీఎం జగన్ సతీమణి భారతిపై ‘భారతీపే’ పేరుతో కొందరు కావాలనే ఫేక్ న్యూస్ సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఇందులో ఐటీడీపీ కీలక పాత్ర పోషించిందని సీఐడీ అధికారులు తెలిపారు. చింతకాయల విజయ్ ఐటీడీపీని నడుపుతున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. అందుకే అతనిపై కేసు నమోదు చేసి విచారణకు సహకరించాల్సిందిగా నోటీసులు అందజేశామని వివరించారు.





Untitled Document
Advertisements