అరుదైన వ్యాధి తో బాధపడుతున్న యువకుడు.. ఒళ్లంతా వెంట్రుకలు..

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 04:22 PM

అరుదైన వ్యాధి తో బాధపడుతున్న యువకుడు.. ఒళ్లంతా వెంట్రుకలు..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు అరుదైన వేర్‌ఉల్ఫ్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ 50 మంది మాత్రమే ఈ సిండ్రోమ్ బారినపడ్డారు. ఈ వ్యాధి సోకినవారికి ముఖంతో పాటు ఒళ్లంతా రోమాలు కప్పేసి.. చూడగానే భయం కలిగించే తోడేలు లాంటి రూపం కలిగి ఉంటారు. రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్‌ పాటిదార్‌ (17) ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ముఖం నుంచి కాలిగోటి వరకు వ్యాపించిన వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిండ్రోమ్‌ ఉన్నవారికి ఒళ్లంతా రోమాలు పుట్టుకొచ్చి, ఎన్నిసార్లు కత్తిరించినా మళ్లీ వస్తుంటాయి.
లలిత్‌ పాటిదార్ పుట్టినప్పుడే ఒళ్లంతా వెంట్రుకలు ఉండేవి. అయితే, వీటిని సాధారణ రోమాలుగా భావించిన వైద్యులు.. అప్పుడే వాటిని తొలగించారు. కానీ ఏడేళ్లు వచ్చేసరికి లలిత్‌ శరీరం అంతా రోమాలతో నిండిపోయింది. దీంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించడంతో వేర్‌వుల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధి ఉందని తెలిసింది. ఈ వ్యాధికి చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, మొదట్లో తన రూపం చూసి పిల్లలు భయపడి, రాళ్లతో కొట్టేవారని లలిత్ తెలిపాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న లలిత్.. సెలవు రోజుల్లో తండ్రికి పొలం పనుల్లో సాయపడతాడు.
‘‘నేను సాధారణ కుటుంబానికి చెందినవాడ్ని.. మా నాన్న రైతు.. ప్రస్తుతం ప్లస్ టూ చదువుతున్నాను.. ఇదే సమయంలో పొలం పనుల్లో నాన్నకు సాయపడతున్నా.. జీవితాంతం ఒంటి నిండా రోమాలతోనే బతకాలి.. పుట్టినప్పుడు వెంట్రుకలు ఉండటంతో వైద్యులు తొలగించినట్టు మా తల్లిదండ్రులు చెప్పారు.. ఆరు లేదా ఏడేళ్ల వయసు వచ్చే వరకూ నాకు తేడా తెలియలేదు.. ఏడేళ్లు వచ్చేసరికి శరీరం అంతా రోమాలతో నిండిపోయింది.. దీనికి చికిత్స లేదని, వీటితోనే జీవించడం నేర్చుకున్నాను’’అని వాపోయాడు.
అమెరికా ప్రభుత్వ జాతీయ మెడిసిన్ లైబ్రరీ ప్రకారం.. మగ లేదా ఆడవారి శరీరంలో ఎక్కడైనా అధిక జుట్టు పెరుగుదలను హైపర్‌ట్రికోసిస్‌గా నిర్వచించారు. అత్యంత అరుదైన ఈ సిండ్రోమ్.. పుట్టుకతోనూ లేదా జననం తర్వాత కొన్నేళ్లకు సోకవచ్చు. విపరీతమైన జుట్టు పెరుగుదల ఇబ్బందులకు గురిచేస్తుంది. ఫలితంగా మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. మధ్యయుగం నుంచి ఇప్పటి వరకూ 50 మందిలో మాత్రమే దీనిని గుర్తించారు. చికిత్సా పద్ధతులలో కాస్మెటిక్ విధానాలు ఉంటాయి. అంతే కాకుండా అవాంఛిత రోమాలను తొలగించడానికి లేజర్ హెయిర్ రిమూవల్, డిపిలేటరీ క్రీమ్‌లు, విద్యుద్విశ్లేషణను ఉపయోగిస్తారు. ఇవన్నీ తాత్కాలికమేనని, ఇప్పటి వరకూ శాశ్వత పరిష్కారం అందుబాటులోకి రాలేదని నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements