పోలీసులకు విసుగు తెప్పిస్తున్న బీహార్ గ్యాంగ్.. రైలు ఇంజిన్లు చోరీ..

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 05:20 PM

పోలీసులకు విసుగు తెప్పిస్తున్న బీహార్ గ్యాంగ్.. రైలు ఇంజిన్లు చోరీ..

పాత ఇనుప వంతెనలు, పాతకాలం రైలు ఇంజిన్లు చోరీకి గురయ్యాయి. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రైల్వే ఇంజినీర్.. గ్యాస్ కట్టర్​తో రైలు ఇంజిన్​ను ముక్కలుగా చేసి అమ్మేశాడు. ఓ హెల్పర్ సాయం తీసుకుని ఈ పని కానిచ్చేశాడు. కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకునే సరికి నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. ఇంజిన్​ పాతబడటంతో విడిభాగాలుగా చేసి డీజిల్​ షెడ్​కు తరలించాలని ఉన్నతాధికారులు అదేశించారని నమ్మించాడు. ఇ బిహార్‌లో ఇటువంటి ఘటనలు సర్వ సాధారణమయ్యాయి.
డీజిల్, పాత రైలు ఇంజిన్‌లతో పాటు ఇనుప వంతెనలను తస్కరించే ప్రక్రియలో దొంగలు బిజీగా గడుపుతున్నారని బిహార్ పోలీసులు తెలిపారు. గతవారం బరౌనిలోని గర్హరా యార్డ్‌లో మరమ్మతుల కోసం తీసుకొచ్చిన డీజిల్ రైలు ఇంజిన్‌ను ఓ ముఠా దొంగిలించిన విషయం తెలిసిందే. ఇంజిన్ భాగాలను ఒక్కొక్కటిగా వేరుచేసిన ముఠా.. సొరంగం ద్వారా ఎత్తుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ముజఫర్‌పూర్‌ ప్రభాత్ కాలనీలోని పాతసామాన్లు గొడౌన్ నుంచి 13 విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
‘‘మరింత కలవరపరిచే విషయం ఏంటంటే మేము యార్డ్‌కు సమీపంలో ఒక సొరంగాన్ని కనుగొన్నాం.. దాని ద్వారా వచ్చిన దొంగలు ఇంజిన్ భాగాలను దొంగిలించి, వాటిని బస్తాలలో తీసుకెళతారు.. రైల్వే అధికారులు ఈ విషయంలో తెలివిగా వ్యవహరించలేదు.’’ అని ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
అలాగే, పూర్ణియా జిల్లాలో ప్రజా ప్రదర్శన కోసం స్థానిక రైల్వే స్టేషన్‌లో ఉంచిన పురాతన మీటర్ గేజ్ ఆవిరి ఇంజిన్‌ను విక్రయించిన మరో ఘటన గతేడాది డిసెంబరులో వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ పేరుతో నకిలీ లేఖను సృష్టించి క్లాసిక్ స్టీమ్ ఇంజిన్‌ను రైల్వే ఇంజినీర్ విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు. వీటితో పాటు ఈశాన్య అరారియా జిల్లాలో సీతాధర్ నదిపై ఒక ఇనుప వంతెనను మరో ముఠా ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దాని భద్రత కోసం ఒక కానిస్టేబుల్‌ను నియమించారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పల్టానియా వంతెన... ఫోర్బ్స్‌గంజ్ పట్టణాన్ని అరారియాలోని రాణిగంజ్‌తో కలుపుతుంది. వంతెనలోని కొన్ని ఇనుప కడ్డీలు, ఇతర కీలక భాగాలు కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వంతెన చోరీకి గురికాకుండా చర్యలు చేపట్టారు.
‘‘మేము వంతెన భద్రత కోసం ఒక కానిస్టేబుల్‌ను నియమించాం.. దీని వల్ల సురక్షితంగా ఉంటుంది’’ అని ఫోర్బ్స్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నిర్మల్ కుమార్ యాద్వెందు తెలిపారు. ‘‘ఇనుప వంతెన భాగాలను దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులపై కూడా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం’’ అని పోలీసు అధికారి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో‌నూ 500 టన్నుల బరువున్న 45 ఏళ్ల నాటి స్టీల్ బ్రిడ్జిని పట్టపగలే దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఇరిగేషన్ అధికారుల పేరుతో జేసీబీ, లారీలు, గ్యాస్ కట్టర్లు తీసుకువచ్చి 3 రోజుల పాటు శ్రమించి వంతెనను దొంగిలించారు. వీరు అధికారులేనని అనుకుని గ్రామస్థులు కూడా సాయం చేశారు. సమీప అధికారులెవరికీ ఇది దొంగతనం అని అనుమానం రాలేదు. ఈ కేసులో జలవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Untitled Document
Advertisements