ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త సినిమాకు మూడో హీరోయిన్ ఫిక్స్..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 11:31 AM

ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త సినిమాకు మూడో హీరోయిన్ ఫిక్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘ఆదిపురుష్’,‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రాల మధ్య డైరెక్టర్ మారుతీతో ఒక కామెడీ సినిమాను ట్రాక్‌లో పెట్టారు. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే నెలలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. కథ ప్రకారం ముగ్గురు యువ హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నారు. వీరిలో మెయిన్ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇప్పటికే ఖరారయ్యారు. ఇప్పుడు తాజాగా మూడో హీరోయిన్‌ను ఖరారు చేశారు. మూడో కథానాయికగా రిధి కుమార్‌ను తీసుకున్నారు.
రిధి కుమార్ ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో క్రీడాకారిణిగా రిధి కనిపించారు. కాకపోతే ఈసారి ప్రభాస్‌కు హీరోయిన్‌గా రిధి నటిస్తుండటం విశేషం. దిల్ రాజు 2018లో నిర్మించిన ‘లవర్’ సినిమా ద్వారా రిధి కుమార్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరవాత ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమాలో నటించారు. ఆమె నటించిన ‘సలామ్ వెంకీ’ అనే హిందీ సినిమా వచ్చే నెల విడుదల కాబోతోంది.
ఇక ప్రభాస్ మిగిలిన ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. భారీ వీఎఫ్ఎక్స్‌తో కూడుకున్న ఈ సినిమాను వెండితెరపై చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దడానికి ఓం రౌత్ అండ్ టీమ్ కష్టపడుతోంది. వచ్చే ఏడాది జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన హోంబలే ఫిలింస్ ‘సలార్’ను రూపొందిస్తోంది. వీటితో పాటు వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ‘ప్రాజెక్ట్ కే’ అనే భారీ యాక్షన్ మూవీని ప్రభాస్ చేస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. ఈ మూడు సినిమాల కన్నా ముందుగా మారుతీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements