బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే షూటింగ్ స్టార్ట్ చేసిన రాధిక..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 02:06 PM

బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే షూటింగ్ స్టార్ట్ చేసిన రాధిక..

హీరోయిన్లు అంటే గ్లామర్. తమ అందచందాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి. శరీర ఆకృతి మారితే హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోకూడదని, పిల్లల్ని కనకూడదని కొందరు ఉచిత సలహాలు ఇస్తుంటారు. అవన్నీ దండగ మాటలని.. తన కూతురికి జన్మనిచ్చిన తరవాతే తాను స్టార్ హీరోయిన్‌ను అయ్యానని సీనియర్ నటి రాధిక అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 నాలుగో ఎపిసోడ్‌లో రాధిక అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో రాధిక గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పారు. రాధిక పాపకు జన్మనిచ్చిన రెండు నెలలకే షూటింగ్‌కు వెళ్లిపోయారని గుర్తుచేశారు.‘‘చెన్నైలో నేను ఉన్నప్పుడు రాధిక నా గాడ్‌ఫాదర్. నా మీద ఈగ వాలినా ఊరుకునేది కాదు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేది. రాధిక ఈజ్ ఫైర్.. ఫైర్ ఈజ్ రాధిక అంతే’’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. వెంటనే రాధిక.. ‘‘నువ్వు కూడా చాలా స్పెషల్’’ అనగానే.. ‘‘నేను అగ్గిరవ్వని.. నువ్వు నిప్పురవ్వవి’’ అంటూ బాలయ్య చమత్కరించారు. అయితే, ఇక్కడే రాధిక గురించి ఒక సీరియస్ విషయం కూడా చెప్పారు. పాప పుట్టిన రెండు నెలలకే షూటింగ్‌కు వెళ్లిన ఘనత రాధికదని బాలకృష్ణ వెల్లడించారు. భారతీరాజా మంచి కథ ఉందని.. నువ్వే చేయాలని పట్టుబట్టడంతో పాప పుట్టిన రెండు నెలలకే సినిమా చేశానని రాధిక చెప్పారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. పాప పుట్టిన తరవాతే తాను స్టార్ హీరోయిన్ అయ్యానన్నారు.‘‘ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఈ ఏడాది నుంచి నేను నటించను, ఇక చాలు అనుకునేదాన్ని. కానీ నేను ఒకటి అనుకుంటాను.. నా నుదిట రాత వేరేలా తీసుకెళ్తుంది. పాప పుట్టింది, నేను హాస్పిటల్‌లో ఉన్నాను. నా గురువు, డైరెక్టర్ భారతీరాజా గారు వచ్చి నన్ను చూశారు. ఎలా ఉన్నావు అని అడిగారు. ఒక స్క్రిప్ట్ ఉంది. ఆ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు.. రెండు నెలల్లో షూటింగ్‌కు వచ్చేయ్ అన్నారు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా అన్నాను. రెండు నెలల తరవాత నన్ను ఈడ్చుకెళ్లిపోయారు. నా బిడ్డ కోసం నా కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నా తలరాత అక్కడ మారిపోయింది’’అని రాధిక చెప్పుకొచ్చారు.
హీరోయిన్స్ పెళ్లిచేసుకుంటే చచ్చిపోయారని సాధారణంగా సినీ పరిశ్రమలో అనుకుంటారని.. ఇక పిల్లలు పుట్టారంటే ఇక వారి గురించే మరిచిపోతారని రాధిక అన్నారు. హీరోయిన్స్‌కు సెల్ఫ్ లైఫ్ ఇంతే ఉంటుంది అనే కాన్సెప్ట్ మారిపోయిందని వెల్లడించారు. అయితే, తన దగ్గర నుంచి ఆ ఆలోచన మారిపోయిందని చెప్పారు. పాప పుట్టిన తరవాతే తాను ఇంకా పెద్ద హీరోయిన్‌గా ఎదిగానని గుర్తు చేశారు. దీంతో బాలయ్య.. ‘‘నువ్వొక ట్రెండ్ సెట్టర్’’ అని ప్రశంసించారు.

Untitled Document
Advertisements