గాడ్‌ఫాదర్ సినిమాలో మూడు పొరపాట్లు ఉన్నాయి అంటున్న పరుచూరి గోపాలకృష్ణ..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 04:57 PM

గాడ్‌ఫాదర్ సినిమాలో మూడు పొరపాట్లు ఉన్నాయి  అంటున్న పరుచూరి గోపాలకృష్ణ..

గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, తన్య రవిచంద్రన్, పూరి జగన్నాథ్, సునీల్, షఫీ తదితరులు నటించారు. కానీ నయనతార, తన్య పాత్రలు చాలా పరిమితంకాగా.. నెగటివ్ రోల్ పోషించిన సత్యదేవ్‌ నటనకి ప్రశంసలు దక్కాయి. అలానే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ పాత్ర పోషించాడు. ఆ క్యారెక్టర్ కూడా తెరపై కనిపించేది కాసేపే. ఇలా ఓవరాల్‌గా అభిమానుల్ని ఊరించిన సినిమా.. కలెక్షన్లని మాత్రం ఊహించని విధంగా రాబట్టలేకపోయిందని బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి.
వాస్తవానికి గాడ్‌ఫాదర్ సినిమా.. మలయాళం మూవీ ‘లూసిఫర్‌’కి రీమేక్. దాంతో గాడ్‌ఫాదర్ రిలీజ్‌కి ముందే లూసిఫర్‌ని చూసిన ప్రేక్షకులకి ఈ కథ ఏంటో తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో కథలో మార్పులు చేసినట్లు గాడ్‌ఫాదర్ యూనిట్ చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా మార్పులు చేర్పులు చేశారు. అయితే.. చిరంజీవికి సపోర్ట్ రోల్స్ చేసిన ఆర్టిస్ట్‌ల ఎంపికలో దర్శకుడు మోహన్ రాజా పునరాలోచించుకుని ఉంటే బాగుండేదని.. అలానే సల్మాన్ పాత్ర, డైలాగ్‌ల విషయంలో ఇంకాస్త కసరత్తు చేసుంటే చప్పట్లు పడేవంటూ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
గాడ్‌ఫాదర్ మూవీ గురించి తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. ఈ క్రమంలో సినిమాలో చిన్న చిన్న తప్పిదాల్ని గుర్తు చేసిన ఆయన.. డ్యాన్స్‌లు లేని చిరంజీవి పాత్రని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓవరాల్‌గా ఆయన చెప్పిన విషయాల్లో ఓ మూడు తప్పిదాల్ని గాడ్‌ఫాదర్ యూనిట్ చేసినట్లు తెలుస్తోంది.
* షఫీ వేసిన పాత్రని సునీల్ వేసుంటే ఇంకా బెటర్‌గా ఉండేదా.. లేదా ఈ ఇద్దరి బదులు వేరే ఆర్టిస్ట్ ఎవరైనా వేసుంటే బాగుండేది.
* సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ఒకరకంగా ప్లస్. మరో రకంగా దెబ్బతీశాడు. ఎలా అంటే.. చిరంజీవి నడుస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడం అభిమానులకి బాధ కలిగించింది. ఆఖరికి క్లైమాక్స్‌లోనూ అదే పంథాని కొనసాగించారు. అదే సల్మాన్ క్యారెక్టర్‌ని పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్‌ చేసుంటే ఆ ఫీలింగ్ అభిమానులకి వచ్చేది కాదు.
* డైలాగ్‌లు బాగున్నాయి. కానీ.. చిరంజీవి స్థాయిలో మాత్రం లేవు. ఉదాహరణకి.. ‘‘నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను. కానీ.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’’ఈ డైలాగ్‌ని ‘‘రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను. కానీ దాన్ని శాసించే సత్తా నాకుంది’’ అని రాసి ఉంటే.. బాగుండేది. ఇలా సినిమాలో ఓ 10 కంపోజింగ్ డైలాగ్‌లు పడింటే ఫ్యాన్స్‌ నుంచి రెస్పాన్స్ బాగుండేది.. చప్పట్లు పడేవి అని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements