గోల్డెన్ అవార్డును సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్.. కీరవాణికి రెహమాన్, చిరు శుభాకాంక్షలు..

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 12:23 PM

గోల్డెన్ అవార్డును సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్.. కీరవాణికి రెహమాన్, చిరు శుభాకాంక్షలు..

80 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు ఈ అవార్డ్స్‌ కోసం అనేక కేటగిరీల్లో పోటీపడుతున్నాయి. ఇక భారత్ నుంచి మొదటిసారి ‘ఆర్‌ఆర్ఆర్’చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకుంది. మొట్ట మొదటిసారిగా ఒక భారతీయ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కాగా.. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్రెస్టీజియస్ అవార్డ్‌ను అందుకున్నారు.
టాలీవుడ్‌లో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటర్నేషనల్ అవార్డు స్వీకరించడం పట్ల పలువురు ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవితో పాటు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ట్విట్టర్‌లో విషెస్ తెలిపారు. ఈ మూమెంట్‌ను చారిత్రక విజయంగా పేర్కొన్న చిరంజీవి.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న కీరవాణికి సెల్యూట్ చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీ నాటు నాటు సాంగ్‌తో ఇండియా గర్విస్తోంది అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ విజయాన్ని అద్భుతమైన నాందిగా పేర్కొన్న రెహమాన్.. ‘కీరవాణి గారు.. భారతీయులందరితో పాటు మీ ఫ్యాన్స్ తరఫున మీకు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు దర్శకుడు రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘నా క్షణ క్షణం సంగీత దర్శకుడు కీరవాణికి అత్యుత్తమ విజయం. ఆర్ఆర్ఆర్ లో ఆయన స్వరపరిచిన పాట రిహన్న, లేడీ గ్యాగ్స్ తదితరులతో పోటీపడి బెస్ట్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ గెలుచుకుంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లండి’ అని ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం ఈ బెస్ట్ మూమెంట్ గురించి ట్వీట్ చేశారు. ఫైనల్‌గా అంతర్జాతీయ వేదిక (గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్)పై భారతీయ సినిమాకు గుర్తింపు లభించింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు అందుకున్నందుకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో పాటు నాటు నాటు సాంగ్‌కు అభినందనలు అని ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ సైతం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంటున్న వీడియో షేర్ చేస్తూ.. ‘ఈ పాట గురించి చెప్పడానికి మాటల్లేవ్’ అని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్.. అద్భుతమైన శుభవార్తతో నిద్రలేచినట్లు పేర్కొన్నాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించారని కీరవాణికి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇండియన్ సినిమాను గర్వించేలా చేసిన దర్శకుడు రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు.





Untitled Document
Advertisements