గత నెలలో రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం దిగుమతులు.. ధర పెరగడమే కారణమట

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 01:43 PM

గత నెలలో రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం దిగుమతులు.. ధర పెరగడమే కారణమట

భారత్ బంగారం దిగుమతుల్లో ఎప్పుడూ ముందుండేది. కానీ ఎపట్లా కాకుండా గత డిసెంబర్ నెలలో బంగారం దిగుమతుల్లో వెనుకబడింది. ఏకంగా బంగారం దిగుమతులు 79 శాతం మేరకు తగ్గిపోయాయి. రెండు దశాబ్దాల కాలంలో ఒక నెలలో ఇంత కనిష్ఠ దిగుమతులు ఇవే. బంగారం ధరలు తిరిగి గరిష్ఠాలకు చేరుకోవడంతో ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ పడిపోయింది.
బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. 2022 డిసెంబర్ నెలలో 20 టన్నుల బంగారం దిగుమతి అయింది. కానీ 2021 డిసెంబర్ నెలలో దిగుమతులు 95 టన్నులుగా ఉండడం గమనార్హం. విలువ పరంగా చూస్తే ఏడాది క్రితం 4.73 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకోగా, క్రితం నెలలో 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
ఇక 2022లో మన దేశం 706 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంది. 2021లో 1,068 టన్నుల బంగారం దిగుమతితో పోలిస్తే గతేడాది 30 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. మన దేశ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల రూపంలోనే తీరుతోంది. 2022లో బంగారం దిగుమతి కోసం ఏకంగా 33.6 బిలియన్ డాలర్లు ఖర్చయింది. ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements