తమ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుండి మొదలవనున్న తొలగింపు ప్రక్రియ

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 10:57 AM

తమ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుండి మొదలవనున్న తొలగింపు ప్రక్రియ

పలు దిగ్గజ కంపెనీలు గత కొంతకాలంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను గత కొంతకాలంగా విడతల వారిగా తొలగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థాయుల్లో ఉన్న ఉద్యోగులను నేటి నుంచే తొలగిస్తోంది. కఠిన ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులకు నేటి నుంచే లేఆఫ్‌లు ప్రకటించబోతున్నట్టు ‘బ్లూమ్‌బర్గ్’ ఓ కథనంలో పేర్కొంది. అయితే, మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని ‘రూమర్’గా కొట్టిపడేశారు.

ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మందికిపైగా ఉద్యోగులను కలిగిన మైక్రోసాఫ్ట్ గతేడాది రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. చివరి త్రైమాసికం ఆదాయాన్ని వెల్లడించడానికి వారం రోజుల ముందు మైక్రోసాఫ్ట్ మరోమారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత కొన్ని వారాలుగా ‘సేల్స్‌ఫోర్స్’, ‘అమెజాన్’లోనూ ఉద్యోగుల తగ్గింపును చూసినట్టు ఇన్వెస్టర్లకు రాసిన నోట్‌లో ‘వెడ్‌బుష్’ విశ్లేషకుడు డాన్ ఇవెస్ తెలిపారు. టెక్ రంగంలో 5 నుంచి 10 శాతం సిబ్బంది తొలగింపు ఉంటుందని ఇవెస్ పేర్కొన్నారు. ఈ కంపెనీలు 1980లలోని రాక్‌స్టార్స్‌లాగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయని, ఇప్పుడు మాత్రం ఈ విషయంలో నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.

కాగా, 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ ఇటీవల ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు ఈ విషయాన్ని చేరవేస్తామని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గతేడాది నవంబరులోనే ప్రకటించింది.

‘స్నాప్‌చాట్’ కూడా 1200 మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి మొదట్లో 10 శాతం మంది ఉద్యోగులు అంటే 8 వేల మందిని తొలగిస్తున్నట్టు ‘సేల్స్‌ఫోర్స్’ ప్రకటించింది. ఇక, ఎలాన్‌మస్క్ సారథ్యంలోని మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్ 7,500 మందిని తొలగించింది.





Untitled Document
Advertisements