ఆ సినిమాలో పాత్ర వేస్తానని నేరుగా అడగలేక చీటిలో రాసి పంపారు.. జంధ్యాల అర్ధాంగి అన్నపూర్ణ

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 01:44 PM

ఆ సినిమాలో పాత్ర వేస్తానని నేరుగా అడగలేక చీటిలో రాసి పంపారు..  జంధ్యాల అర్ధాంగి అన్నపూర్ణ

జంధ్యాల ఈ పేరు వినగానే మన పెదవుల పై అప్రయత్నంగా చిరునవ్వులు విరబుస్తాయి. ఆయన కథలు రాసిన సినిమాలలో కనిపించే హాస్య సన్నివేశాలు ఇప్పటికి ఆనాటి తరం వారి కళ్ళ ముందు సజీవమే.. నేటి తరం వారిలోనూ కొంత మేర జంధ్యాల గారి హాస్య చతురత సుపరిచితమే .. జంధ్యాల గారు తెలుగు చిత్రాల కథలను నవ్వుల నావలో నడిపించిన రచయితగా .. దర్శకుడిగా జంధ్యాల కనిపిస్తారు. రచయితగా ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో .. దర్శకుడిగాను అంతే పేరును సంపాదించుకోవడం ఆయన ప్రత్యేకత. ఇటు క్లాసికల్ సినిమాలకు .. అటు మాస్ సినిమాలకు రాసి మెప్పించడం ఆయనలో మాత్రమే కనిపించే మరో విశేషం. అలాంటి జంధ్యాలను గురించి ఆయన అర్ధాంగి అన్నపూర్ణ తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
"మా మావగారికి బిజినెస్ ఉండేది .. ఆయన దగ్గరే ఉంటూ జంధ్యాల ఆ పనులను చూసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే నాటకాలు రాసేవారు. ఆ తరువాత సినిమాలలో అవకాశం కోసం మద్రాసు వెళ్లారు. పెళ్లినాటికి నా వయసు 15 అయితే .. ఆయన వయసు 22. మేము అద్దెకి దిగిన ఇంట్లో అంతకుముందు కె. విశ్వనాథ్ గారు ఉండేవారట. ఆ తరువాత ఆయన ఈ ఇంటికి ఎదురుగా సొంత ఇల్లు కట్టుకుని అందులోకి వెళ్లారు. ఎదురిల్లే కావడం వలన విశ్వనాథ్ గారితో పరిచయం పెరిగింది" అన్నారు.

విశ్వనాథ్ గారు జంధ్యాల గారిని నమ్మి 'సిరి సిరి మువ్వ' సినిమాకి రాసే ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరూ వరుస సినిమాలకి పనిచేస్తూ వెళ్లారు. 'ఆపద్బాంధవుడు' సినిమాలో మీనాక్షి శేషాద్రి తండ్రి పాత్రకి ఇంకా ఎవరినీ అనుకోలేదు. ఆ సినిమాకి రైటర్ జంధ్యాలగారు కావడంతో, ఆ పాత్రను తాను వేస్తానని ఒక చీటీపై రాసి విశ్వనాథ్ గారికి పంపించారు. 'ఆ విషయం అడగడానికి అంత మొహమాటమైతే ఎట్లాగయ్యా?' అంటూ విశ్వనాథ్ గారు ఆ పాత్రను ఆయనతో చేయించారు" అంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements