గాంధారి గొప్ప భార్యగా కీర్తించబడుటకు కారణం?

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 04:18 PM

గాంధారి గొప్ప భార్యగా కీర్తించబడుటకు కారణం?

మహాభారతం అనేది అన్నదమ్ముల మధ్య సాగిన సంగ్రహం అని చెప్పవచ్చు. ఇందులో కౌరవులు, పాండవులు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. అయితే ఈ కౌరవుల తల్లే గాంధారి. ఈరోజు గాంధారి గురించి తెలుసుకుందాం. గాంధారి అనే పాత్ర హిందూ ఇతిహాసం అయినటువంటి మహాభారతంలోనిది. 
అందులో ఆమె గాంధార రాజు అయిన సుబల అనే చక్రవర్తి కుమార్తె, ప్రస్తుతం ఇది వాయువ్య పాకిస్తాన్ మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రదేశాల్లో విస్తరించి ఉంది. గాంధార అన్న రాజ్యం పేరు నుండే ఆమెకు గాంధారి అన్న పేరు వచ్చింది.

గాంధారి వివాహం హస్తినాపుర రాజ్యానికి చెందిన పెద్ద యువరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడితో జరిగింది. గాంధారి తన వైవాహిక జీవితమంతా స్వచ్ఛందంగా కళ్లకు గంతలు కట్టుకుంది. 
అందుకుగల కారణం లేకపోలేదు ఆమె భర్త ధృతరాష్ట్రుడు అంధుడిగా జన్మించాడు. దృతరాష్ట్రుడిని పరిణయమాడిన గాంధారి అతనికి చూపు లేదన్న విషయం తెలుసుకుని తన భర్త ఎన్నటికీ ఆనందించలేని చూపు యొక్క ఆనందాన్ని తాను కూడా తిరస్కరించాలని నిర్ణయించుకుంది. అప్పటి నుండి గాంధారి కళ్ళకు గంతలు కట్టుకునే ఉంది. ఇందుకుగాను ఆమె గొప్ప భార్యగా కీర్తించబడింది కూడా.

గాంధారికి వంద మంది కుమారులు వారందరినీ సమిష్టిగా కౌరవులు అని పిలుస్తారు మరియు ఒక కుమార్తె. ఆమె పేరు దుశ్చల. ఈమెకు జయద్రతునితో వివాహం జరిగింది. కౌరవుల్లో  ప్రధానంగా దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు, మహాభారతంలోని ప్రతినాయకులు అని దాదాపుగా అందరికీ తెలుసు. కురుక్షేత్రంలో వారి దాయాదులైన పాండవులతో జరిగిన యుద్ధంలో గాంధారి కుమారులు అందరూ పాండవుల చేత చంపబడ్డారు.

గాంధారి కుమారులను చెడ్డవారిగా చిత్రీకరించబడినప్పటికీ, మహాభారతం గాంధారికి ఉన్నత నైతిక ప్రమాణాలను ఆపాదించింది. ధర్మాన్ని అనుసరించి పాండవులతో శాంతి నెలకొనాలని ఆమె తన కుమారులను పదే పదే ఉద్బోధించింది.  ముఖ్యంగా తనను అక్కలా గౌరవించే పాండవుల తల్లి కుంతిదేవి అంటే ఆమెకు చాలా మక్కువ.

గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకున్న స్థితికి ఒక్క మినహాయింపు ఉంది. అది కూడా కురుక్షేత్ర యుద్ధం యొక్క పద్దెనిమిదవ రోజు. ఆరోజున భీముడు తన కుమారుడగు దుర్యోధనుడి తొడలను పగులగొట్టడం చూసింది గాంధారి.

గాంధారి కూడా మహా భక్తురాలు. మరి ముఖ్యంగా పరమ శివుని ఆరాధకురాలు. గాంధారి తన భక్తితో పరమ శివున్ని మెప్పించి నూరుగురు కుమారులను కనగలిగే వరాన్ని పొందింది. దృతరాష్ట్రుని తండ్రి గాంధారిని కోడలిగా చేసుకోవడానికి ఇది ఇక కారణమని చెపుతారు.

గాంధారి తన కంటి చూపును త్యాగం చేసి కఠినమైన జీవితం జీవించడం ద్వారా ఆమెను గొప్ప ఆధ్యాత్మిక శక్తి వరించింది. గాంధారి తన వంద మంది కుమారులను కోల్పోయిన వేదన ఫలితంగా ఆమె కృష్ణుడిని శపించడంతో యాదవుల నాశనానికి నాంది పలికింది. ఆమె కళ్లకు గంతలు కట్టిన గుడ్డలోని చిన్న ఖాళీ ద్వారా ఆమె చూపు యుధిష్ఠిరుడి కాలిపై పడిందని కూడా చెబుతారు. ఆమె కోపం మరియు శక్తి కారణంగా అతని బొటనవేలు నల్లగా కాలిపోయింది. ఆఖరి రోజుల్లో గాంధారి తన భర్త మరియు ఆమె తోడికోడలు కుంతితో కలిసి హిమాలయాలలో తన జీవితాన్ని ముగించింది. అక్కడ వారు అడవిలో మంటల్లో మరణించారు.





Untitled Document
Advertisements